Tuesday, November 26, 2024

Hyderabad: సినిమా డిస్ట్రిబ్యూషన్​లో పెట్టుబడుల పేరిట మోసం.. హైదరాబాద్​లో ఇద్దరు మోసగాళ్ల అరెస్టు

సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఇస్తామని మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శంకర్ ఫిల్మ్స్ పేరుతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను నడుపుతున్న నాగం ఉమా శంకర్, కొంగర అంజమ్మ సినిమా పంపిణీలో పెట్టుబడుల సాకుతో 25 మందికి పైగా అమాయకులను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సినిమా డిస్ట్రిబ్యూషన్​లో పెట్టుబడులతో మంచి లాభాలు వస్తాయని ప్రజల నుంచి సుమారు 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తరువాత, పెట్టుబడిదారులకు అసలు మొత్తాన్ని కానీ, దాని వల్ల వచ్చిన లాభాలను కానీ చెల్లించలేదు. ఈ క్రమంలో పెట్టుబడికి డబ్బులు ఇచ్చిన వారు వారి మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

దీంతో డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ కి చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. వారిపై IPC 406, 420, 506, r/w 34 కింద కేసు నమోదు చేశారు. ఇంకా.. సెక్షన్ 5 తెలంగాణ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (TSPDFE) చట్టం 1999 ప్రకారం కూడా చర్యలు తీసుకోనున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ రకమైన పెట్టుబడిపైనా ఏడాదికి స్థిరంగా 8-10శాతం కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడం అనేది అసాధ్యమని పోలీసులు చెబుతున్నారు. అందుకని మోసగాళ్ల మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చి ఇబ్బందుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement