Friday, November 22, 2024

కూకట్‌పల్లి ఏటీఎం దొంగలు దొరికారు

హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన కూక‌ట్‌ప‌ల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దోపిడీ కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. ఏప్రిల్ 29వ తేదీ మ‌ధ్యాహ్నం ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జ‌రిపి రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దుతో ఉడాయించిన సంగ‌తి తెలిసిందే. నిందితుల కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

నిందితులు అజిత్ కుమార్, ముఖేష్ కుమార్ బీహార్ వాసులు అని సీపీ సజ్జనార్ తెలిపారు. వారి నుంచి రూ. 6.31 ల‌క్ష‌లు, మూడు సెల్‌ఫోన్లు, నాటు తుపాకీతో పాటు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ఏటీఎం దోపిడీ కేసులో ప్ర‌ధాన నిందితుడు అజిత్ కుమార్ అని సీపీ పేర్కొన్నారు. అజిత్ కుమార్ ఉపాధి నిమిత్తం 2011లో దుండిగ‌ల్‌కు వ‌చ్చాడు. తొలుత కార్మికుడిగా, ఆ త‌ర్వాత కాంట్రాక్ట‌ర్‌గా ప‌ని చేశాడు. ఈ క్ర‌మంలో చెడు వ్య‌స‌నాల‌కు బానిపై దోపిడీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 2018లో దుండిగ‌ల్‌లో మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ కార్యాల‌యంలో దోపిడీకి య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. పారిపోయే ప్ర‌య‌త్నంలో ప‌ట్టుబ‌డి అజిత్ జైలు పాల‌య్యాడు. జైలు నుంచి వ‌చ్చాక బీహార్ వెళ్లి.. రెండేళ్ల త‌ర్వాత‌ మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. గండి మైస‌మ్మ వ‌ద్ద ఓ ప్యాకేజింగ్ ప‌రిశ్ర‌మ‌లో కార్మికుడిగా చేరాడు. స్నేహితుడు ముకేష్ సాయంతో మ‌ళ్లీ నేరాలు చేసేందుకు కుట్ర చేశాడు.

ఈ క్ర‌మంలో తుపాకీ కొనేందుకు ముకేష్‌కు అజిత్ రూ. 30 వేలు పంపాడు. తుపాకీ, తూటాలు స‌మ‌కూర్చిన ముకేష్ సాయంతో అజిత్ దోపిడీలు చేశాడు. ఏప్రిల్ 16న మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ కార్యాల‌యంలో రూ. 1.15 ల‌క్ష‌లు దోపిడీ చేశారు. ఏప్రిల్ 24న దుండిగ‌ల్‌లో బైక్ చోరీకి పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 29న కూక‌ట్‌ప‌ల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం వ‌ద్ద చోరీ చేసిన‌ట్లు స‌జ్జ‌నార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement