Friday, November 22, 2024

Followup: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ తరహాలో మరో రెండు ఘటనలు.. హైదరాబాద్‌లో అరాచకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఘటన మరువక ముందే రాజధాని హైదరాబాద్‌లో ఈ తరహా ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 14 ఏళ్ల బాలికను అపహరించిన నలుగురు ఆటో డ్రైవర్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 17వ తేదీ రాత్రి తల్లితో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి చేరింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళుతున్న సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఈ యువకులు ఒంటరిగా వెళుతున్న ఆ బాలికను వెంటాడి ఆమెతో మాటలు కలిపి బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు.

అక్కడి నుంచి బండ్లగూడ, ఆరామ్‌ఘర్‌, మెహిదిపట్నం ప్రాంతాలను తిప్పుతూ ఓ రహస్య ప్రదేశంలో అమ్మాయిపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. 18వ తేదీ ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో అమ్మాయి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పాటు జరిగిన విషయమంతా చెప్పారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులు సీసీ కెమెరాల ఆధారంగా పహడిషరీఫ్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు చెప్పారు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో..
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఫైవ్‌ స్టార్‌ పబ్‌లో యువతిపై కొందరు యువకులు దాడికి పాల్పడి గాయపరిచిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. యునైటెడ్‌ నేషన్స్‌లో పని చేస్తున్న యువతి స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లింది. రూఫ్‌టాప్‌ పబ్‌ లాంజ్‌లో సదరు యువతి ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం పబ్‌కు వచ్చిందని తెల్లవారు జాము వరకు పబ్‌లోనే ఉన్న బాధితురాలిపై ఎనిమిది మంది ఆకతాయిలు ఆమెతో మాటలు కలిపి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమె మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌, ఇంటి చిరునామా చెప్పాలని వేధించారు. ఇందుకు ఆ యువతి ససేమిరా అనడంతో తాగిన మైకంలో ఆ ఎనిమిది మంది యువకులు సదరు యువతితో పాటు ఆమెతో వచ్చిన మరో ఇద్దరిపై మద్యం బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు.

ఫోన్‌ నెంబర్‌ ఎలా ఇవ్వవని యువతిని నిలదీయడంతో పాటు ఆమెను అసభ్యంగా తిట్టిపోశారని పక్కకు తీసుకువెళ్లి అబ్రర్‌, సాద్‌ అనే యువకులు అమ్మాయి ఒంటిపై చేయి చేసుకుని వికృత చేష్టలకు దిగారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతటితో ఆగకుండా యువతిపై అఘాయిత్యానికి పాల్పడతామని హెచ్చరించడంతో ఆమె అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అడ్డు వచ్చిన బాధితురాలి స్నేహితురాళ్లపై కూడా ఆ యువకులు మద్యం సీసాలతో తల, శరీరంపై గాయపరిచి తమ అక్కసును తీర్చుకున్నట్లు తెలుస్తోంది. అడ్డుకోబోయిన పబ్‌ నిర్వాహికులపై ఆ యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని సమాచారం.

గాయాల పాలైన యువతి పబ్‌ నుంచి నేరుగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుందని ఆ తర్వాత రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి పబ్‌లో చోటుచేసుకున్న పరిణామాలన్నింటినీ వివరించినట్టు సమాచారం. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి పబ్‌లోని సీసీ ఫుటేజీ వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. తనతో పాటు స్నేహితురాళ్లపై దాడికి పాల్పడిని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్‌ చేసింది.

- Advertisement -

విచారణ షురూ
పబ్‌లో జరిగిన వ్యవహారంపై రాయదుర్గం పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీస్‌ స్టేషన్‌కు బాధిత యువతితో పాటు గాయాల పాలైన విష్ణు వెళ్లి జరిగిన సంగటంతా చెప్పారు. తమపై ఎనిమిది మంది సభ్యులు గల గ్యాంగ్‌ దాడికి పాల్పడిందని యువతితో పాటు విష్ణు అనే మరో యువకుడు పోలీసులకు చెప్పాడు. తనతో పాటు మరో ఇద్దరు స్నేహితులం కలిసి బార్‌ అండ్‌ పబ్‌కు వెళ్లామని అక్కడ తమతో పాటు ఉన్న అమ్మాయి మ్యూచువల్‌ ఫ్రెండ్‌ తన స్నేహితులతో వచ్చారని తెలిపింది. కొద్ది సేపటి తర్వాత అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని అడ్డుకునేందుకు ప్రయత్నించామని విష్ణు అనే యువకుడు పేర్కొన్నారు.

కానీ అటువైపు ఉన్న వ్యక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అమ్మాయిని అత్యాచారం చేస్తామని బెదిరించారని చెప్పారు. తనపై బీర్‌ బాటిల్‌తో దాడి చేసి తల పగులకొట్టారని విష్ణు చెప్పారు. దాడి చేసిన వారు ఎనిమిది మంది వరకు ఉన్నారని వారంతా పలుకుబడి కలిగిన కుటుంబాల నుంచి వచ్చినట్లు వారి మాటలను బట్టి తెలుస్తోందని చెప్పారు. తమకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లామని బార్‌ అండ్‌ పబ్‌ సిబ్బంది అభ్యర్థించడంతో ముందు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయలేకపోయామని చెప్పారు. బార్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో అన్ని రికార్డయ్యాయని వాటిని పరిశీలిస్తే ఎనిమిది మంది ఎవరన్నది తేలుతుందని విష్ణు పోలీసులకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement