Tuesday, November 26, 2024

తెలంగాణలో 2 డెల్టా ప్లస్‌ కేసులు.. సెకండ్ వేవ్ తగ్గలేదుః వైద్యారోగ్య శాఖ

తెలంగాణలో రెండు డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాస రావు వెల్లడించారు. భారత్‌ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. మానవ శరీరంపై డెల్టా వైరస్‌ ప్రభావం ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇన్ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యాన్ని ఈ రకం వైరస్‌లో గుర్తించామని పేర్కొన్నారు. కరోనా రెండో దశ ఇంకా పూర్తిగా తగ్గలేదన్నారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా బాధితులు బయట తిరగొద్దని సూచించారు. 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, కరోనా మూడో దశకు మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1.12 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ లు ఇచ్చామని చెప్పారు. మొత్తం 33.79 లక్షల మందికి రెండు డోసులు తీసుకున్నారని వివరించారు. కేంద్రం నుంచి అదనంగా 9.5 లక్షల డోసులు వచ్చాయని వెల్లడించారు. ఒకట్రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. కరోనా మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 26 వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని, పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని డీహెచ్‌ శ్రీనివాస రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement