కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా లేకపోవడానికి ముఖ్య కారణం వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటమేనని పలువురు నిపుణులు వెల్లడించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికార యంత్రాంగం ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు కోట్ల మంది టీనేజర్లకు (15-18 ఏండ్ల వయస్సు ఉన్నవారికి) రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. 15-18 మధ్య సంవత్సరాల వయస్సు ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యువ భారతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
టీనేజర్లు ఉత్సాహంగా కొవిడ్ టీకాలు తీసుకుంటున్నారని అన్నారు. కాగా, 15-18 సంవత్సరాల మధ్య వయుసున్న వారికి టీకాలు వేసేందుకు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనిలో భాగంగానే రెండు కోట్ల మంది టీనేజర్లకు రెండు డోసుల టీకాలు అందించారు. అలాగే, కరోనా థర్డ్ వేను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోసులు సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
కరోనా నియంత్రణ కోసం కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 175.0 కోట్ల కోవిడ్-19 టీకాలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 90.7 కోట్లు ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 75.1 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్పటివరకు మొత్తం 75,68,51,787 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..