Wednesday, November 20, 2024

సరిహద్దుల వద్ద అంబులెన్స్ ల క్యూ… కరోనా బాధితులు ఆర్తనాదాలు!

ఏపీ, తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ నుంచి వస్తున్నఅంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అంబులెన్స్‌లు నిలిచిపోతున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో కఠిన నిబంధనలు పోలీసులు అమలు చేస్తున్నారు. పాసులు లేకుండా..రాష్ట్రంలోకి వస్తున్నవారిని పోలీసులు అడ్డుకున్నారు. అంబులెన్స్‌లను సైతం వెనక్కి పంపించిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర రవాణాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారని పోలీసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా సాధారణ రాకపోకలతోపాటు ఎమర్జెన్సీ వాహనాలను కూడా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

దీంతో అంబులెన్సులు అడ్డుకోవడంపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను నిరసన తెలిపారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం హైదరాబాద్ హాస్పిటల్ లకు పేషెంట్లు వెళ్తుంటే నిబంధనల పేరుతో వారిని వెనక్కి పంపడం బాధాకరమన్నారు. మనం భారతీయులమని, ఆంధ్ర- తెలంగాణ వేరు వేరుగా చూడకూడదున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచించాలని ఎమ్మెల్యే ఉదయభాను కోరారు.

మరోవైపు అలంపూర్ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర ఏపీకి చెందిన అంబులెన్సులను పదుల సంఖ్యలో అంబులెన్సులు వరకు వెనక్కి పంపించారు.  పోలీసులు అంబులెన్స్‌లను తెలంగాణలోకి రాకుండా నిలిపివేశారు. సుమారు వంద అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. బాధితులు ఎంత బ్రతిమలాడినా పోలీసులు, వైద్యశాఖ అధికారులు ఒక్క అంబులెన్స్‌ను కూడా అనుమతించలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటలకు ఓ అంబులెన్స్‌లో ఉండే పేషెంట్ మృతి చెందాడు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అనుమతి ఉంటేనే తప్ప పోలీసులు పుల్లూరు టోల్ గేట్ నుంచి అనుమతించడంలేదు. దీంతో కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement