Friday, November 22, 2024

Sad Story | ప‌చ్చ‌ని కాపురంలో చిచ్చు.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య

తొట్టంబేడు /తిరుపతి, (ప్రభ న్యూస్‌): వారి కులాలు వేరు.. ఊర్లు వేరు. మనసులు కలిశాయి. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చిన్నారులు జన్మించారు. పేద కుటుంబం అయినా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో భర్త వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఇదే ఓ తల్లి, ఇద్దరు పిల్లల ప్రాణాలు బలిగొంది. ఈ విషాదకర ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులో తొట్టంబేడు మండలం ఈదులగుంట కాలనీలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన రామాంజులు కుమార్తె శివమ్మ అలియాస్‌ శివలక్ష్మి(24) బతుకు దెరువు కోసం తిరుపతి వచ్చింది. శ్రీకాళహస్తి పట్టణ శివారులోని ఈదులగుంట నివాసం ఉన్న బుజ్జయ్య కుమారుడు శివయ్య ఆటో నడుపుతూ జీవనం చేస్తుంటాడు. శివయ్య సోదరిని రేణిగుంటలో ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

ఇదిలా ఉండగా బతుకుదెరువు కోసం తిరుపతికి వచ్చిన శివమ్మకు ఆటో డ్రైవర్‌ శివయ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. శివమ్మ గిరిజన కులానికి చెందినది కాగా… శివయ్య దాసరి కులానికి చెందిన వాడు. వీరిద్దరూ ఈదులగుంటలో నివాసం ఉంటున్నారు. వీరికి రోహిత్‌ (3), దేవాన్ష్‌ (10నెలలు) ఇద్దరు సంతానం. శివయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. శివమ్మ కూడా కుటుంబ పోషణకు తనవంతు సహకారం అందిచేంది.

అయితే ఇటీవల ఈ దంపతుల మధ్య వివాహేతర సంబంధం అనే అనుమానం ఎక్కువైంది. ఈ కారణంగానే శివమ్మ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. పంచాయితీ కూడా జరిగింది. తన వద్దకు రాక పోతే శివమ్మ చెల్లెలును పెళ్లి చేసుకుంటానని శివయ్య బెదిరించాడు. పంచాయితీ తరువాత శివమ్మ ఇటీవలనే తన భర్త శివయ్య దగ్గరకు మళ్లీ వచ్చింది. గురువారం రాత్రి భార్య, భర్తల మధ్య వివాహేతర సంబంధం గురించి వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శివయ్య తన భార్య శివమ్మను కొట్టడంతో వివాదం మరింత పెరిగింది.

- Advertisement -

శుక్రవారం ఉదయం మళ్లీ భార్య, భర్తల మధ్య వివాదం జరిగింది. ఆ తరువాత శివయ్య మందుల కోసం బయటకు వచ్చాడు. ఈ సమయంలో శివమ్మ తన ఇద్దరు పిల్లలు రోహిత్‌, దేవాన్ష్‌ ను ఉరి వేసి చంపి తాను కూడా ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటి తరువాత చుట్టు పక్కల వారు గమనించ‌డంతో శివమ్మ, ఆమె పిల్లలు విగతజీవులై కనిపించారు. ఈ విషయం భర్త శివయ్యకు చెప్పారు. వీరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు- వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు, శ్రీకాళహస్తి రెండవ పట్టణ సీఐ మల్లిఖార్జున, ఎస్‌ ఐ మహేష్‌ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శివయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement