ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ – సుకుమా సరిహద్దులో జరిగిన మావోల ఎదురుకాల్పుల్లో.. 23మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో.. గుంటూరు, విజయనగరం జిల్లాలకు చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ.. విధి నిర్వహణలో జరిగిన పోరాటంలో అసువులుబాశారు. దీంతో వారి గ్రామంలో విషాదం అలుముకుంది.
మావోయిస్టులు జరిపిన దాడిలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ(34) వీరమరణం పొందారు. ఆదివారం రాత్రి ఈ సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు హతాశులయ్యారు. శాఖమూరి విజయకుమారి, రవీంద్రబాబు దంపతుల రెండో సంతానమైన మురళీకృష్ణ.. ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా-210 విభాగంలో ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తూ మావోయిస్టుల ఘాతుకానికి విగత జీవిగా మారారు. ఇవాళ మధ్యాహ్నం మురళీకృష్ణ మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.
జవాన్ మురళికృష్ణ కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పరామర్శించారు. జవాన్ కుటుంబాన్ని ఓదార్చారు. జవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అంబటి రాంబాబు భరోసా ఇచ్చారు.