Sunday, November 10, 2024

వెంకయ్యనాయుడు అకౌంట్‌కి మళ్లీ బ్లూ బ్యాడ్జి

ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ఖాతా నుంచి బ్లూ టిక్ ను ట్విట్ట‌ర్ తొలగించింది. అయితే, దీనిపై ఉపరాష్ట్రప‌తి కార్యాల‌యం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో ట్విట్ట‌ర్‌ మ‌ళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది. సాధార‌ణంగా ట్విట్ట‌ర్ ప‌లు ర‌కాల ఖాతాల‌కు బ్లూ టిక్‌ను ఇస్తుంది. ఈ బ్యాడ్జి ఉండే ఆ ఖాతాలను ట్విట్ట‌ర్ ధ్రువీక‌రించింద‌ని, ఆ ఖాతాలు న‌కిలీవి కావ‌ని అర్థం. ప్ర‌భుత్వ సంస్థ‌లు, బ్రాండ్లు, లాభాపేక్ష లేని  స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వార్తా సంస్థ‌లు, జ‌ర్న‌లిస్టులు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు, క్రీడాకారులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ నాయ‌కులకు బ్లూ టిక్ ఇస్తుంది.

సాధార‌ణంగా ఆరు నెల‌ల పాటు యాక్టివ్ గా లేని ఖాతాలు, ఉద్దేశ పూర్వ‌కంగా అస‌త్య ప్రచారం చేయ‌డం, పేరు మార్చుకోవ‌డం వంటి చ‌ర్య‌లకు పాల్ప‌డితే ట్విట్ట‌ర్ బ్లూ టిక్ గుర్తింపును తొల‌గిస్తుంది. వెంక‌య్య నాయుడు ఆరు నెల‌లుగా త‌న వ్య‌క్తిగ‌త ఖాతాలో పోస్ట్ లు చేయ‌డం లేదు. ఈ కార‌ణంగానే ఆయ‌న బ్లూ టిక్‌ను తొల‌గించింది. అయితే, దీనిపై భార‌త ఉపరాష్ట్ర‌ప‌తి కార్యాలయం కూడా ట్విట్ట‌ర్‌కు అభ్యంత‌రాలు తెలిపింది.  వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయ్యాక తన సమాచారం అంతా… అధికారిక ఉపరాష్ట్రపతి కార్యాలయ అకౌంట్ నుంచి పంపుతున్నారనీ, అంత మాత్రాన యాక్టివ్‌గా లేనట్లు కాదని పేర్కొంది. దీంతో ట్విట్టర్ తన తప్పును సరిచేసుకుంది. మళ్లీ బ్లూ బ్యాడ్జ్ వేసేసింది.  కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి… చివరిసారిగా గతేడాది జులై 23న ఓ ట్వీట్ చేశారు. ఆయన అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement