భారత దేశం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. అటు మూఢనమ్మకాలు, జాతకాలకు కూడా మన దేశమే హైలైట్‌గా నిలుస్తుంది. పెళ్ళికి జాతకాలు కలవకపోతే వధూవరులు సంతోషంగా ఉండరని, అమ్మాయికి మాంగళ్య దోషం ఉంటే పెళ్లి కాదని, మర్రి చెట్టుకు, రావి చెట్టుకు కలిసి పెళ్లి చేస్తే త్వరగా పెళ్లవుతుందని.. ఇలాంటి నమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి
మంగళ దోషం పోగొట్టుకోవడానికి ఓ లేడీ టీచర్ తన ట్యూషన్‌కు వచ్చే 13 ఏళ్ల బాలుడిని పెళ్లాడింది. పంజాబ్ జలందర్‌లో ఈ ఘటన జరిగింది. బాగా చదవట్లేదని, సదరు విద్యార్థిని తన ఇంట్లోనే ఉంచుకుని భయం చెప్తానని బాలుడి తల్లిదండ్రులను ఆ టీచర్ ఒప్పించిందట. తర్వాత తన కుటుంబం సాయంతో ఆ వారంలోనే పెళ్లితో పాటు వెడ్డింగ్ నైట్ కూడా చేసుకుందట.
అనంతరం భర్త చనిపోయినట్లు గాజులు పగలకొట్టి వితంతువుగా మారింది. అంతేకాకుండా భర్త చనిపోయాక ఏర్పాటు చేసే సంతాప సభను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బాలుడిని ఇంటికి పంపించింది. ఇంటికి వచ్చిన బాలుడు మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బస్తీ బావా ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబ సభ్యులు బలవంతంగా తన కుమారుడితో వివాహ కార్యక్రమాలను నిర్వహించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.