జూన్ నుంచి డిసెంబర్ లోగా సుమారు 100 టీఎంసీల ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని జల నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు చకచకా సాగుతున్నాయి. జూన్ నాటికి నడిగడ్డలో నీరు పరవళ్లు తొక్కే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పూర్తి ఆయకట్టు 55వేల 600 ఎకరాలకు నీరందించేందుకు సుంకేసుల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోసేందుకు తల పెట్టిన తుమిళ్ల ఎత్తిపోతల మొదటి దశ నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసుకుని సాగునీరు అందిస్తోంది. గద్వాల్,అలంపూర్ 55వేల 600 ఎకరాలకు సాగునీరు అందుతోంది. రోజోలిబండ డైవర్షన్ స్కీం పరిధిలో అసంపూర్ణంగా ఉన్న తుంగభద్ర నీటికి అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగింది. మొదటిదశలో 3 పంపులను అమర్చి 2018 జనవరి 8న అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది రాయి వేశారు.
కేవలం ఆరునెలల రికార్డు సమయంలోనే మొదటి దశ పనులు పూర్తి చేసి 2018 అక్టోబర్ లో ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండుదశల నిర్మాణ పనుల కోసం రూ. 783 కోట్లు మంజూరు చేయగా రూ. 389 కోట్ల తో మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి.మొదటి దశలో 340 క్యూసెక్కుల నీటిని పంప్ చేయడానికి 5.5మెగావాట్ల రెండు పంపులు, 392 క్యూసెక్కుల పంప్ చేయడానికి 10.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో పంపును ఏర్పాటు చేశారు. మొదటి రెండు పంపులు నేరుగా ఆర్డీఎస్ కాలువకు నీటిని తీసుకువెళ్లుతుండగా మూడవ పంపు పనుల్లో భాగంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు రెండుదశల్లో 15.9 టీఎంసీలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా చివరి ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులు రెండవ దశలో ఉన్నాయి.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండవ దశ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. రెండవ దశ పూర్తి అయితే ప్రాజెక్టు లక్ష్యంగా మరో 31వేల 900 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఇప్పటికే 55వేల 600 ఎకరాలకు మొదటి దశలో నీరందగా రెండవదశలో మరో 31వేల 900 ఎకరాలకు నీరు అందనుంది. మొత్తంగా రెండుదశల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలోభాగంగా 87వేల 500 ఎకరాలకు సాగునీటి లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్, జులేకల్, వల్లూరు గ్రామాల్లో రిజర్వాయర్ల నిర్మాణ పనులు రెండవదశలో పూర్తి కావల్సి ఉన్నాయి. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ కు రూ. 394 కోట్ల పరిపాలనా పరమైన అనుతులు ఇచ్చి జూన్ నాటికి పూర్తి చేయాలని గడువు విధించడంతో పనుల్లో పురోగతి ఉంది.