Wednesday, November 20, 2024

టీటీడీ సంచలన నిర్ణయం

రిటైర్డ్ అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్థత ఏర్పడింది.

2018 మేలో అప్పటి పాలకమండలి ఆలయ అర్చకులకు రిటైర్మెంట్ నిబంధనలు అమలు చేసింది. 65 సంవత్సరాల పైబడిన అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస మూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు ఈ నలుగురితో పాటూ మరో ఐదుగురు రిటైర్డ్ అయ్యారు. గోవింద రాజ స్వామి ఒకరు, తిరుచానూరులో ఇద్దరు కూడా రిటైర్ అయ్యారు.

తిరచనూరు ఆలయం ప్రధాన అర్చకుడు, మరొక అర్చకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 2018 డిసెంబర్‌లో రిటైర్డ్ నిబంధనను వర్తింపచేయకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవే ఆదేశాలను తమకు అమలు చేయాలని అర్చకులందరూ టీటీడీ అధికారులను కోరారు. రమణ దీక్షితులు కూడా జగన్‌ను కలిసి కోరారు.. తాము అధికారంలోకి రాగానే వీరికి న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత రమణ దీక్షితుల్ని గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారు. ఇప్పుడు టీటీడీ రిటైర్డ్ అయ్యిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement