Sunday, November 24, 2024

Spl Story | ఆదరణతోపాటు ఆమ్దానీ.. టీఎస్​ఆర్టీసీ లాజిస్టిక్స్​ సేవలతో 90కోట్ల రెవెన్యూ!

తెలంగాణ ఆర్టీసీకి ప్రజా రవాణాతోపాటు లాజిస్టిక్స్​ విభాగం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గతంలో ఉన్న సిస్టమ్​ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్​ సమూలంగా మార్చేశారు. దీంతో ఒక్క లాజిస్టిక్స్​ విభాగానికే అదనంగా 90 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. ఇక.. కార్గో, పార్సిల్స్​ రెండు సేవల ద్వారా దాదాపు 200 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు సమాచారం.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కి చెందిన లాజిస్టిక్స్ విభాగం సాధారణ ప్రజల నుండి మాత్రమే కాకుండా ప్రైవేట్ సంస్థల నుండి కూడా సానుకూల స్పందన, ప్రోత్సాహాన్ని పొందుతోంది. దీని ఫలితంగా ఆదాయం కూడా పెరిగినట్టు స్పష్టమవుతోంది. 2022లో లాజిస్టిక్స్ విభాగం సుమారు రూ. 90 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది ప్రజలు, ప్రైవేట్ సంస్థల నుంచి ప్రజాదరణను ప్రతిబింబిస్తుంది. కాగా, RTC తన కార్గో సేవలను 2018లో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్‌లకు విస్తరించింది. ఇప్పటి వరకు బస్సుల ద్వారా 108 లక్షల పార్సిళ్లు రవాణా అయ్యాయి. కార్గో, పార్సిల్స్​ ఈ రెండు సేవల ద్వారా సుమారు రూ. 200 కోట్ల ఆదాయం టీఎస్​ ఆర్టీసీకి సమకూరింది.

ఏప్రిల్ 2022లో కార్గో సేవలను పునరుద్ధరించారు. దీన్ని లాజిస్టిక్స్ విభాగంగా పేరు మార్చారు. అప్పటి నుండి ప్రజల నుంచి మరింత సానుకూల స్పందన వచ్చింది. ఇది కాస్త ఆదాయాన్ని పెంచడంలో సహాయపడింది. ప్రస్తుతం.. కార్పొరేషన్ 15,000 నుండి 18,000 పార్సిళ్లను ఎక్కడికైనా డెలివరీ చేసే కెపాసిటీ కలిగి ఉంది. ఇట్లా రోజుకు దాదాపు రూ. 25 లక్షల ఆదాయాన్ని తెచ్చుకుంటోంది. దేశంలోని ప్రతి ఏరియాకు సజావుగా.. సమయానికి పార్సిల్స్​ని రవాణా చేయడానికి, పంపిణీ చేయడానికి ఇతర సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక.. లాజిస్టిక్స్ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో వస్తువులు లేదా పార్సిల్స్​ బుకింగ్ నుంచి.. అవి డెలివరీ అయ్యే వరకు కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో వాటి పురోగతిని ట్రాక్ చేయవచ్చు అని TSRTC సీనియర్ అధికారి తెలిపారు. దీనిద్వారా ఇరత ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీలు కూడా తమ వస్తువులను మెరుగైన, అవాంతరాలు లేని సేవ కోసం తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే లాజిస్టిక్స్ విభాగం ద్వారా పంపడానికి ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -

అయితే.. తొలినాళ్లలో RTC అధికారులు సాంకేతిక, లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వినియోగదారులకు సేవలను సులభతరం చేయడానికి.. మరింత ఈజీగా చేరవేయడానికి కావాల్సిన పద్ధతులను సమీక్షిస్తున్నారు. ప్రధాన బస్ స్టేషన్లలో 177 కార్గో, పార్సిల్​ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 443 ప్రైవేట్ ఏజెంట్లను నియమించారు. బల్క్ గూడ్స్ రవాణా కోసం.. 193 కార్గో ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ (CTVలు) తయారు చేశారు. ప్రభుత్వ శాఖల వస్తువుల రవాణా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. 

గత ఏడాది మేడారం జాతర సందర్భంగా TSRTC లాజిస్టిక్స్ కూడా 5,258 ‘బంగారం’ (అమ్మవారి పసుపుకుంకుమ, బెల్లం) పొట్లాలను రవాణా చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో భద్రాచలం వద్ద సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 88,658 ‘తలంబ్రాలు’ ప్యాకెట్లను ఇంటింటికీ డెలివరీ చేసింది. ఇక.. గత ఏడాది మేలో జగిత్యాల వ్యవసాయ క్షేత్రంలో తాజా బంగనపల్లి మామిడి పండ్లను కూడా వినియోగదారుల ఇంటి వద్దకే డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement