నిరుద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్ పాస్‌లపై డిస్కౌంట్‌ను ప్రకటించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగ యువతకు చేయూత అందించేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్టుగా ప్రకటించారు. ఈ రెండు రకాల బస్ పాస్‌లు జంట నగరాల్లోని అన్ని బస్ పాస్ కౌంటర్లలో పొందవచ్చని తెలిపారు.
ఈ రెండు బస్ పాస్‌లు పొందడానికి పోటీ పరీక్షల కోసం ట్రైనింగ్ క్లాసులకు హాజరవుతున్న వారిని అర్హులుగా పేర్కొంది. బస్సు పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జిరాక్స్ లేదా నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. కాగా మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్‌లకు రూ.3,450 వసూలు చేస్తున్నారు. 20 శాతం సబ్సిడీ పోగా రౌండప్ చేసి రూ.2,800 వసూలు చేయనున్నారు. అదే విధంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు ప్రస్తుతం రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20 శాతం రాయితీపై రౌండప్ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ వివరించింది.