Friday, November 22, 2024

TSRTC – మేడారం పోదాం పా! స్పెష‌ల్ బ‌స్సులు రెడీ

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర‌ మేడారం. సమ్మక్క-సారలమ్మ చెంత‌కు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. నెల రోజుల‌కు ముందు నుంచే రాక‌పోక‌లు కొన‌సాగుతున్నాయి. ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని చాలామంది ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా, భక్తుల రద్దీ దృష్ట్యా 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు న‌డ‌ప‌నున్న‌ట్టు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సాగుతోంది. దీనికి ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. తాడ్వాయిలో టికెట్‌ ఇష్యుయింగ్‌ కౌంటర్లు, కామారంలో బస్సుల పార్కింగ్ కోసం మూడు పాయింట్లు.. మేడారంలో 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్‌.. బేస్‌ క్యాంప్‌.. 48 క్యూ రెయిలింగ్స్ ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు వ‌చ్చే మ‌హిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంద‌ని సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు. ఈ మేరకు చర్యలు తీసుకున్న‌ట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 14.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నట్టు సజ్జనర్ తెలిపారు.

16న మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంపు ప్రారంభం
ఈ నెల 16న మేడారంలో టీఎస్‌ఆర్టీసీ బేస్‌ క్యాంప్ ప్రారంభం కానుంది. మేడారం జాతరలో దాదాపు 14వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తించ‌నున్నారు. వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడారం జాతరను టీఎస్‌ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న‌ట్టు స‌జ్జ‌నార్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఈ జాతరకు బ‌స్సుల ద్వారా 30లక్షల మంది రానున్న‌ట్టు ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో తాకిడి ఎక్కువే..

ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లను ఆర్టీసీ గుర్తించింది. ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement