హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు, రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్‌తో ముడిపడిన కేసు కావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్ అధి కారులు లోతుగా విచారిస్తున్నారు. మూడో రోజు కూడా మొత్తం 9మంది నిందితులను అధికారులు విచారించినట్లు తెలిసింది. ఈ విచారణలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చినట్లు విశ్వ సనీయ సమాచారం. అక్టోబర్ నుంచే పేపర్ లీక్ అయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా విచారణ చేస్తున్నారు. గ్రూప్-1 పేపర్‌ను రాజశేఖర్ చాలా మందికి అమ్ముకున్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. గ్రూప్-1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. వీళ్లను కూడా విచా రించేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కరీం నగర్‌కు చెందిన ఆరుగురికి రాజశేఖర్ గ్రూప్-1 పేపర్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అందులో పలువురు ఎన్‌ఆర్‌ఐలతో పాటు, మరికొంత మంది స్థానికులు గ్రూప్-1 పరీక్షలు రాసినట్లు అధికారులు గుర్తించారు. పరీక్షలు రాయడానికి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. పేపర్ విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులను రాజశేఖర్ స్నేహితులు, బంధువుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు మరింత లోతుగా విచారణ జరిపి అసలు నిజాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
గతేడాది అక్టోబర్ నుంచి టీఎస్‌పీఎస్‌సీ ఏడు పరీక్షలను నిర్వహించింది. దీంతో ఈ ఏడు పోటీ పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించిన 500 మంది జాబితాను సిద్దం చేసినట్లు తెలి సింది. దాదాపు 100కు పైగా మార్కులు వచ్చిన వారందరినీ సైతం సిట్ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వివిధ సంఘాల విద్యార్థి నేతలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. పేపర్ లీకేజీలో విద్యార్థులు పలు ఆరోపణలు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు అయిన రాజశేఖర్ తల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారని ఆరోపించారు. సీడీపీవో పరీక్ష పేపర్ కూడా లీక్ అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పరీక్షను కూడా రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పేపర్‌నే లీకు చేసిన నిందితులు సీడీపీవో పేపర్ ఎందుకు లీక్ చేసి ఉండరని ప్రశ్నించారు. ఆ పరీక్షను రద్దు చేయకపోవడానికి కారణాలు ఏంటని నిలదీస్తున్నారు. సీడీపీవో పరీక్ష విషయంలోనూ సిట్ విచారణ చేయాలని, పేపర్ లీక్ అయ్యిందా లేదా అన్నది తేల్చాలంటూ టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించారు.
పేపర్ లీకేజీపీ సీఎం స్పందించాలి
నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే సీఎం కేసీఆర్ స్పందించాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.రోహిత్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళ చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ కేసు నుండి కాపాడుకోవడానికి ఢిల్లిdకి వెళ్తున్న రాష్ట్ర మంత్రి వర్గానికి నిరుద్యోగుల బాధ అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిను బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.