హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: టీ-ఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. జాతీయ స్థాయిలో పెను దుమారం రేపి సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీలో తవ్వే కొద్ది కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మరింత దూకుడును ప్రదర్శించాలని నిర్ణయించినట్టు- అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఏఈఈ నియామక పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజర్లను ఉపయోగించి ముగ్గురు అభ్యర్థులు జవాబులు రాసినట్టు- తాజాగా సిట్ విచారణలో బయట పడినట్టు- సమాచారం. ఏఈఈ ప్రశ్నా పత్రాల లీకేజీలో వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీరుగా పని చేస్తున్న రమేష్‌ను సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రమేష్ ద్వారా ఏఈఈ పరీక్ష రాసిన ప్రశాంత్, నవీన్, మోహన్‌లు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు- సిట్ విచారణలో బయట పడింది. ఈ ముగ్గురు అభ్యర్థులు ముందుగా అందుకున్న ప్రశ్నపత్రంతో జవాబులను రికార్డు చేసి వాటిని ఎలక్ట్రానిక్ డివైజర్ల ద్వారా పరీక్షలో రాసినట్టు- సిట్ గుర్తించింది. గతంలో ఐఐటీ (జేఈఈ), నీట్‌తో పాటు- జాతీయ స్థాయిలో నిర్వహించిన వివిధ ప్రవేశ పరీక్షల్లో ఈ తరహా డివైజర్లను ఉపయోగించి విద్యార్థులు టాప్ -టె-న్ ర్యాంకులు సాధించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. తిరిగి ఏఈఈ నియామక పరీక్షలో ఈ తరహా డివైజర్లను ఉపయోగించి ఉద్యోగాలను కొల్లగొట్టాలన్న కుట్ర జరిగినట్టు- సిట్ గుర్తించింది. ఈ స్కామ్ వెనుక పెద్ద కుట్రే జరిగి ఉండవచ్చన్న అనుమానాలను సిట్ వ్యక్తం చేస్తోంది. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే అవకాశం లేదని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డివైజర్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కమిషన్ ఉన్నతాధికారులు, సంబంధిత చీఫ్ సూపరిం-టె-ండెంట్ ఇన్విజిలేటర్ల పాత్ర ఉంటు-ందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ డివైజర్లను కేవలం ఏఈఈ పరీక్షకు మాత్రమే ఉపయోగించారా లేక గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు- ఇతర నియామక పరీక్షలకు వాడారా అనే కోణంలో విచారణ చేయాల్సి ఉంటు-ందని సిట్ అధికారులు భావిస్తున్నట్టు- సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా లీకేజీ కేసులో ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాల లీక్ అంశంలో రవికిషోర్ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్‌ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు. రమేష్ ప్రశ్నా పత్రాలను ముగ్గురికే విక్రయించాడా? ఇంకెంత మందికి ఇది చేరిందన్న కోణంలో సిట్ విచారణను ముమ్మరం చేసింది. ఇరవై మంది దాకా ఏఈఈ పేపర్ చేరి ఉండవచ్చని సిట్ అనుమానించి ఆ దిశగా విచారణ వేగవంతం చేసినట్టు- సమాచారం.
ఏఈఈ పరీక్షలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన (టాపర్‌గా) అభ్యర్థి ప్రశాంత్‌కు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏమిటో సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసినట్టు- తెలుస్తోంది. స్కూల్ విద్యార్ధులు కూడా ఠక్కున చెప్పే ఈ సూత్రాన్ని టాపర్ చెప్పలేక సిట్ అధికారుల ఎదుట నీళ్లు మింగినట్టు- సమాచారం. గణితం, చరిత్ర, రాజనీతి, ఆర్థికశాస్త్రం అంశాలపై పట్టు- సాధించకున్నా అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్నపత్రాలతో పోటీ- పరీక్షల్లో టాప్ మార్కుల్లో నెగ్గాడు. ప్రశ్నాపత్రాల లీకేజీలో భాగంగా గ్రూప్-1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారిని సిట్ అధికారులు వేర్వేరుగా విచారించారు. వారు చెప్పే జవాబుల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు. ఈ క్రమంలో ఏఈ పరీక్షలో టాపర్‌గా నిలిచిన వ్యక్తిని ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ వంటి లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే తెల్లమొహం వేశాడు. మరొక అభ్యర్థి ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు వరుసగా రాసుకొచ్చి అడ్డంగా బుక్కయ్యాడు. మిగతావారు మార్చి 5న పరీక్ష రాశామని, రెండు నెలలకే సమాధానాలు మరచిపోయా మంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాగా మార్చి 5న టీ-ఎస్‌పీఎస్‌సీ ఏఈ పరీక్ష నిర్వహించింది. ఐతే పరీక్షకు మూడ్రోజులు ముందుగానే ప్రశ్నపత్రాలు చేతులు మారాయి. నిందితులు సురేష్, రవికిషోర్, దివ్య, విక్రమ్ ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని ఏఈ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు చేరవేశారు.