Sunday, September 8, 2024

ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ స్థలాలు.. మంత్రి కేటీఆర్‌ సానుకూలత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ స్థలాలను వినియోగానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సానుకూలంగా స్పందించారని పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఛైర్మన్‌ వై. సతీష్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్‌ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారని వివరించారు.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో టీఎస్‌ఐఐసీకి చెందిన స్థలాలతోపాటు ఐటీ సెక్టార్‌, టీహబ్‌, టీ వర్క్‌ ్స కు చెందిన స్థలాల్లో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు హైదరాబాద్‌లో టీఎస్‌ఐఐసీకి చెందిన 28 ప్రాంతాలు అనువుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. పరిశ్రమలశాఖ ఆ స్థలాలను కేటాయిస్తే ఆయా ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ, నేషనల్‌ క్లీన్‌ ఎనర్జీ ప్రోగ్రాం స్కీం కింద డీసీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల మౌళిక వసతుల కల్పనకు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌కు వివరించామన్నారు. తమ విజ్ఞప్తులపై మంత్రి సానుకూల స్పందించారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement