Friday, November 22, 2024

TS – నోటిఫికేషన్ ఎప్పుడు? – అభ్యర్థుల ఎదురుచూపు!

డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3..
హాస్టల్‌ వెల్ఫేర్‌, డీఏవో నోటిఫికేషన్లు
ఎదురు చూస్తున్న 20 లక్షల మంది అభ్యర్థులు
జారీ చేసిన వాటికి పరీక్ష తేదీలు ప్రకటించని టీఎస్‌పీఎస్‌సీ
ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ అభ్యర్థనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడుతాయి? ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌-1, డీఏవో పరీక్షలు రద్దు కాగా, గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు ఎన్నికల షెడ్యూల్‌ వల్ల వాయిదా పడ్డాయి. గ్రూప్‌-3, హాస్టల్‌ వెల్ఫేర్‌ తదితర పరీక్షల తేదీలు ఇంత వరకూ ప్రకటించనేలేదు. ఈ ఆరు నోటిఫికేషన్ల కోసం దాదాపు 20 లక్షల మంది వరకు అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడడంతో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీకు దాదాపు 3 లక్షల మంది, గ్రూప్‌-1కు 2.5 లక్షలు, గ్రూప్‌-2కి 5.5 లక్షలు, గ్రూప్‌-3కు 5.60 లక్షలు, హాస్టల్‌ వెల్ఫేర్‌కు 1.45 లక్షలు, డీఏవో ఉద్యోగాలకు 1.10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈనోటిఫికేషన్లకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయని, ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఫిబ్రవరి 1న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని పేర్కొంది. దీంతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ నేడో రేపో వెలువడుతుందని అభ్యర్థులు ఆశగా ఎదురుచూశారు. కానీ నోటిఫికేషన్‌ విడుదలపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2017లో టిఆర్టి (డీఎస్సీ) తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇప్పటి వరకు వెలువడలేదు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కాలయాపన చేస్తూ గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం 5089 టిచర్‌ పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్షల షెడ్యూల్‌ ఇచ్చారు. పోస్టులు పెంచాలని అభ్యర్థులు అనేక సార్లు ఆందోళనలు చేపట్టినా కానీ, పోస్టుల పెంపుపై ప్రభుత్వం మాత్రం ఆసక్తి చూపలేదు. గతేడాది నవంబర్‌ 20 నుండి 30 వరకు జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు- తర్వాతైనా అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేస్తారని అభ్యర్ధులు భావిస్తే అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే ఇంతవరకూ నోటిఫికేషన్‌ ఊసేలేదు. గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్‌ పోస్టులు కాకుండా మరో 5 వేల టీ-చర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ అధికారులూ లెక్కలు సేకరించారు. కానీ అనుబంధ నోటిఫికేషన్‌కు ఆర్థిక శాఖ అనుమతి రాలేదు

. ఈనెలలో లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ ఎన్నికల కోడ్‌ వస్తే మే వరకు కోడ్‌ అమలులో ఉంటు-ంది. ఆతర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల కోడ్‌.. ఇలా వరసగా ఆటంకాలు ఏర్పడుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి-కై-నా ప్రభుత్వం స్పందించి ఆగిపోయిన డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలకు అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసి పరీక్షల షెడ్యూల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూన్నారు. ఇదిలా ఉంటే ఒట్రెండు రోజుల్లో టీఎస్‌పీఎస్‌సీ సమావేశమై నోటిఫికేషన్ల జారీ, పరీక్ష తేదీల ప్రకటన, ఫలితాల విడుదలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement