హైదరాబాద్, ఆంధ్రప్రభ: పోడు సమస్యను పరిష్క రించాలని, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరు జ్జీవింపచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు అమలులో ఆదేశించిన విధంగా పని చేస్తున్న జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సీఎం స్పష్టంచేశారు. అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధు లను భాగస్వాములను చేయాలని సూచించారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ – పునరుజ్జీవం, హరిత హారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరి గింది.
అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుండి వచ్చే శక్తులే అడవిని నాశనం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. గోండు, కోయ లాంటి గిరిజన తెగల అడబి బిడ్డలు అడవికి నష్టం చేయరన్నారు. బయటి నుంచి వచ్చే శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలన్నారు.
ఫారెస్టు లోపల పోడుసాగు చేస్తున్న గిరిజనులకు సమీపంలోని ప్రభుత్వ భూములను సాగుకు కేటాయించాలని, ప్రభుత్వ భూములు లేనిపక్షంలో అటవీ భూముల అంచున సాగు భూమిని కేటాయించి, వారికి నీరు, కరెంటు, నివాస సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫారెస్టు భూములకు శాశ్వత బౌండరీలను ఫిక్స్ చేసి సరిహద్దులకు ప్రొటెక్షన్ ట్రెంచ్ ఏర్పాటు చేసి, ట్రెంచ్‌పైన గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు.
కోట్లమొక్కలు నాటినా అడవితో సమానం కాదు..
సోషల్ ఫారెస్టులో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా ఒక అడవితో సమానం కాదని సీఎం అన్నారు. ఒక పది ఎకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్‌లో పునరుజ్జీవం చేపట్టినట్లుగానే అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అడవి లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ శాఖ భూముల్లో అడవులను అభివృద్ధి చేయాలన్నారు.
జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలి
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్ని జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు తదితరులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ హక్కులు కల్పించడంతో పాటు ఆ తర్వాత అటవీ భూమి ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదనే విషయంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
నవంబర్ 8 నుండి పోడు దరఖాస్తుల స్వీకరణ
నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు సాగు చేసుకుంటున్న గిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నవంబర్ 8లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేసి ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రెండు, మూడు గ్రామాలకొక నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
87 శాతం పోడు భూముల ఆక్రమణ భద్రాద్రి-కొత్తగూడం, కొమురంభీం-ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్-భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లాంటి 12 జిల్లాల్లోనే ఉందని సీఎం అన్నారు.