హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధులో సీఎం కేసీఆర్ ద్వంద్వ నీతినే పాటిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దళిత బంధుతో హుజురాబాద్ లో దళితులపై ఓట్ల వల విసిరిన సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది దళిత విద్యార్థులు విలవిలలాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం అవసరమైతే 3 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతానని ప్రకటించిన కేసీఆర్.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా అదే దళిత విద్యార్థుల ఉసురుపోసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిధుల కొరత కారణంతో రాష్ట్రంలో ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 12.5 లక్షల మంది విద్యార్థులకు రెండేళ్లుగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ లక్షలాది మంది దళిత విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో.. పరీక్షలు రాసేందుకు అనుమతి లేక ఇప్పటికే అనే మంది విద్యార్థిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థి లావణ్య కూడా ఫీజు చెల్లించలేకపోయానన్న కారణంతో ప్రాణాలు తీసుకుంది. అయితే, ప్రభుత్వానికి మాత్రం ఆ దళిత విద్యార్థిని చావు కనిపించలేదు. లక్షలాది దళిత విద్యార్థుల భవిష్యత్తులో కోసం బకాయిలు చెల్లించేందుకు ముందుకు రాని సర్కార్.. హుజురాబాద్‌లో మాత్రం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేందుకైనా చేతులు వస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ప్రతి సంవత్సరం సగటున 5.45 లక్షల కొత్త విద్యార్థులు, అలాగే 7.99 లక్షల మంది పాత విద్యార్థులు రీఎంబర్స్‌మెంట్ స్కీమ్‌ను క్లెయిమ్ చేస్తున్నారు. అలా వారి కోసం ఏటా ప్రభుత్వం రూ .2,300 కోట్లు విడుదల చేయాలి. కానీ ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరానికి కేవలం రూ .784 కోట్లు మాత్రమే కాలేజీలకు ఇచ్చింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి అయితే ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ, గత రెండేళ్లకు సంబంధించిన 3,216 కోట్ల రూపాయల బకాయిలే అందలేదు.
ఇప్పటివరకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ కింద రూ.3,816 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. అయితే, వీటిని క్లియర్ చేయడానికి రెండేళ్లుగా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కానీ.. అంతే మొత్తంలో హుజురాబాద్‌లో దళిత బంధు కోసం డబ్బు ఖర్చు పెట్టేందుకు మాత్రం ఖజానాలో సొమ్ములు ఎలా కనిపించాయి? అనేది ప్రశ్న. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో.. అనేక చోట్ల కళాశాల యాజమాన్యాల విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నాయి. కొన్ని చోట్ల పరీక్షలకు హాజరుకానివ్వకపోగా.. మరికొన్న చోట్ల కోర్సు పూర్తయినా.. ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు.