రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చి రెండు నెలలు గడిచింది. అయినా అక్కడ ఎట్లాంటి డెవలప్ మెంట్ పనులు జరగ లేదు. దీంతో వచ్చిన గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉందని చారిత్రక పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ కవి గుడి ఆవేదనను తన అక్షరాలతో తెలిపిండు. పాట రూపంలో రామప్ప తన ఆవేదన తెలియజేస్తున్నట్టు పదాలు కైగట్టిండు. ఆ కవి హృదయం నుంచి వచ్చిన భావాలను చాలా మంది లైక్ చేస్తున్నరు. సీఎం కేసీఆర్ సారు మనస్సు కరిగేలా ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ పాట ఓసారి పాడుకోండి.. నచ్చితే లైక్ చేయండి..
మా తెలంగాణ ముఖ్యమంత్రి
కేసియారు సారూ
రామప్పా గుడి దిక్కూ
ఒక్కసారి జూడు / తెలం/
యునెస్కో గుర్తింపు
నాకొచ్చెను సారూ
నా అభివృద్ధి పనులేవీ
చేయరేంది మీరు /తెలం/
నాకు గుర్తింపు ఉండాలని
లేద మీకు సారూ
అది రద్దయితే ఆ పేరు
మీకొస్తది సారూ /తెలం/
గొంతెత్తి మా గోడును
చెప్పినంక కూడా
పట్టింపులేని తనం
మీకెందుకు సారూ / తెలం/
పురావస్తు శాఖ అని
అది ఒక్కటి ఉంటది
పక్కల బాంబులు పేల్చిన
పండుకొనే ఉంటది /తెలం/
కలకల రేగినంక
కండ్లు తెరిసి చూస్తది
ఎక్కడ ఏమైందంటూ
ఎతుక్కుంట వస్తది. /తెలం /
“జీ హుజూరు” అనకుంటే
ఛీ కొడతరు మీరూ
చినజీయర్ స్వామి మాటె
మీరింటరు సారూ /తెలం/
చారిత్రక కట్టడాలు
మీకెందుకు సారూ
యాదాద్రి, భద్రాద్రులు
మీకుంటే సాలూ /తెలం /
ఉంటె గింటే మీ పేరు
రాళ్ళళ్ళనే ఉంటది
నా శిల్పా చరిత్రంతా
జనం గుండెల్లో ఉంటది.
-నల్లెల్ల రాజయ్య , హన్మకొండ