హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో స్టార్టప్‌లకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే స్టార్టప్ కంపెనీలను అన్నివిధాల ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం భవిష్యత్తులో వాటికి మరింత చేయూతనివ్వనున్నట్లు తెలుస్తోంది. టీ హబ్, టీ వర్క్స్ లాంటి ఇంక్యుబేటర్‌ల ఏర్పాటుతో స్టార్టప్‌లకు పెట్టుబడి సమీకరణ నుంచి నిర్వహణ వరకు సహకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్‌కు చెందిన ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ముందు ముందు అన్ని రంగాలకు చెందిన స్టార్టప్‌లకు ఊతం లభించనుంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లగ్ అండ్ ప్లే ప్లాట్‌ఫాం సహాయ సహకారాలతో రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధి మరింత వేగవంతమవనుందని ఐటీ, పరిశ్రమల శాఖల అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ బృందం సాధించిన ఘనతగా అధికారులు పేర్కొంటున్నారు. ప్లగ్ అండ్ ప్లే వంటి సంస్థల రాకతో హైదరాబాద్ నగర ఖ్యాతి మరింత ఇనుమడించ నున్నట్లు వారు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆవిష్కరణలకు ప్రాధాన్య మివ్వడంలో భాగంగా ప్రభుత్వం అంకుర కంపెనీలను విరివిగా ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలోనే 2015లో ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీల ఇంక్యుబేటర్ టీ హబ్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఇంక్యుబేషన్ కేంద్రం నుంచి స్ఫూర్తి పొందిన పలు రాష్ట్రాలు అక్కడి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించ డానికిగాను ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల మహారాష్ట్ర ఎమ్ హబ్ పేరుతో స్టార్టప్‌ల ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
”ఆలోచనలతో రండి.. వ్యాపారవేత్తలుగా వెళ్లండి” అన్న నినాదంతో ప్రారంభమైన టీ హబ్ ఎంతో మంది స్టార్టప్‌ల వ్యవస్థాపకులను అతి పెద్ద వ్యాపారవేత్తలుగా మార్చింది. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మూలధన ఫండ్ సేకరణకు సహకరించడం, మార్కెట్ విస్తరణలో తోడ్పడ్డం లాంటివి చేసి చిన్న కంపెనీలు ఓ మోస్తరు కంపెనీలుగా ఎదగడానికి తోడ్పడింది. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో ట్యాబ్-32 పేరిట వివిధ బ్యాచ్‌లను నిర్వహిస్తోంది. వ్యవసాయం, ఎడ్యు టక్, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్మార్ట్‌సిటీస్, స్మార్ట్‌మొబిలిటీ వంటి విభాగాల్లో స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటివరకు టీ హబ్‌లో 5 బ్యాచ్‌లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఆరోవిడతకు 200 కంపెనీలు దరఖాస్తు చేసుకోగా 22 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఇంజనీరింగ్, మొబిలిటీ, విద్యుత్త వాహనాలు, ఐఓటీ, విద్య, ఆరోగ్య, న్యాయరంగాలు, కృత్రిమ మేధ, మెషిన్ లర్నింగ్ తదితర విభాగాల్లోని స్టార్టప్‌లను ఆరోవిడతకు ఎంపిక చేశారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో తెలంగాణలోని స్టార్టప్‌లకు టీ హబ్ ప్రోత్సాహం అందిస్తోంది. ఇప్పటి వరకు కోటి రూపాయలదాకా ఆర్థిక సాయం అందించింది. రెజిజ్.హైదరాబాద్ పేరిట 15కు పైగా ఇంక్యుబేటర్లను వేదికపైకి తీసుకువచ్చి వందకుపైగా స్టార్టప్‌లకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
వివిధ దేశాల్లోని సంస్థలతో కలిసి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. దక్షిణ కొరియా స్టార్టప్‌లకు భారత మార్కెట్‌లో ప్రవేశ విధానం, వ్యాపార అవకాశాల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జపాన్‌తో కలిసి ”రోడ్ టు షైన్” ప్రోగ్రాం ద్వారా 20 దాకా స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించింది. లాట్రోబ్ వర్సిటీతో కలిసి గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రాం ద్వారా ఆస్ట్రేలియా స్టార్టప్‌ల ఎదుగుదలకు తోడ్పడింది. ప్రపంచస్థాయి స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు బ్రిటీష్ ప్రభుత్వ ఇన్నోవేషన్ ఏజెన్సీ, కెనడా, టోక్యో స్వీడన్, దుబాయ్ తదితర దేశాలతో కలిసి పనిచేస్తోంది.
ఇప్పటివరకు టీ హబ్ 1800 దాకా స్టార్టప్‌లతో అసోసియేట్ కాగా రూ.1860 కోట్ల పెట్టుబడిని అవి సేకరించేందుకుగాను తోడ్పడినట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. 2015లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 350 కార్పొరేట్ కంపెనీలతో కొలాబరేషన్ ఒప్పందాలు కుదుర్చుకుని వాటికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించడంలో విజయ వంతమైందని అధికారులు చెబుతున్నారు. టీ హబ్ ద్వారా సహకారం పొందిన, ఇంక్యుబేట్ అయిన స్టార్టప్‌లన్నింటిలో కలిపి ఇప్పటివరకు 15000 వరకు ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.