Friday, November 22, 2024

రూ.15వేల కోట్ల‌తో వైద్య ఆరోగ్య శాఖ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15 వేల కోట్లతో వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. ఎన్నికల సంవత్సరం కావడంతో వ్యయ అంచనాలను ఎక్కువగా ప్రతిపాదించినట్లు తెలిసింది. కొత్త మెడికల్‌ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్లు, పౌష్టికాహార కిట్లు వంటి పథకాలను పరిగణనలోనికి తీసుకుని వైద్య,ఆరోగ్య శాఖ ఈ మేరకు బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించింది. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ 2021-22లో రూ.6007 కోట్లు ఉండగా, 2022-23లో బడ్జెట్‌ రూ.4 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.10,954 కోట్లకు చేరింది. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా మరో 9 కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగాం, నిర్మల్‌, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాలలో కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి విడతలో కొత్త మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ ఆసుపత్రులకు రూ. 34.38 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గత ఏడాది ఒకేరోజు 8 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా 9 మెడికల్‌ కళాశాలల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వచ్చే అకడమిక్‌ ఇయర్‌ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం దాదాపు రూ.500 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం గత నాలుగేళ్లుగా కేసీఆర్‌ కిట్లను బాలింతలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. అలాగే, రాష్ట్ర్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయతలపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించగా, గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమని గుర్తించిన వారికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా భారీగానే బడ్జెట్‌ అవసరం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేస్తున్నది. అలాగే, పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడానికి ప్రైవేటు ఆసుప త్రులలోనూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందుకు గాను పేద ప్రజలు ఉచితంగా వైద్య, శస్త్ర చికిత్సలు చేయించుకున్నందుకు ప్రైవేటు ఆసుప్రతులకు ప్రతీ ఏడాది రూ.వందల కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవడంతో పాటు త్వరలో రాష్ట్రంలో అసెంబ్లిd ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ రూ. 15 వేల కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement