ఆ నాలుగు రోజులు ఎంతో విశిష్టత
అంబరాన్నంటే భక్తజన వన సంబరం
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర
ప్రకృతి ప్రతిరూపాలు.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు తల్లులు
తల్లిని తాకాలనే తపనతో భక్తుల తాపత్రయం
పచ్చని అడవిలో ఇసుక వేస్తే రాలని జనం
ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచిన మేడారం కుంభమేళాకు సర్వం సన్నద్ధమైంది. పచ్చని అడవిలో ఇసుకేస్తే రాలనంత భక్తజన వనసంబురం మొదలైంది. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలో కొలువుదీరిన గిరిజన ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో పలు ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఎత్తు బంగారం (బెల్లం), చీరె-సారే, పూలు, పండ్లు, గాజులు, పసుపు-కుంకుమలతో, ముడుపులు కట్టి మొక్కులు సమర్పించుకుంటారు. బెల్లం పానకం, ఎదురుకోళ్లతో నైవేద్యాలు సమర్పించి తన్మయత్వంతో మురిసిపోతారు. ఆ తల్లులు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం ఇస్తూ, మహిమాన్విత శక్తులుగా విరాజిల్లుతున్నారు. ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది.
ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి
జాతర విశిష్టత, ప్రాచుర్యం ఇలా..! (మొదటి రోజు బుధవారం) కన్నెపల్లి కల్పవల్లి ఆగమనం)
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మేడారంలో మహాజాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క కూతురు కన్నెపల్లి కల్పవల్లి, వరాల తల్లి సారలమ్మ నివాసం కన్నెపల్లి. ములుగు జిల్లా మేడారానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ఆలయంలో ప్రతిష్టించిన సారలమ్మ ఫిబ్రవరి 21న (బుధవారం) సాయంత్రం మేడారంలోని గద్దె వద్దకు చేరుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మను గిరిజన పూజారులు (వడ్డెలు) మేడారంలోని గద్దెలకు వచ్చి అక్కడ ప్రత్యేక ముగ్గులు వేసి మళ్ళీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి చేరుకుంటారు. అక్కడ గిరిజన పూజారులు (వడ్డెలు) సుమారు రెండు గంటల పాటు అత్యంత రహస్యంగా పూజలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో భాదపడుతున్న వేలమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో గుడి ఎదుట పొర్లు దండాలతో, సాష్టాంగ నమస్కారాలతో వరం పడుతుంటారు. దేవతా రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళతారు. ఆ వరాలతల్లి, కల్పవల్లి సారలమ్మే తమ పైనుంచి నడిచి వెళ్తుందని భక్తులు నమ్ముతారం. సారలమ్మను గిరిజన పూజారి (వడ్డె) మోస్తుంటే ట్రస్టు కమిటీ, ప్రజాప్రతినిధులు వెంట నడుస్తారు. అతడిని దేవదూతగా భావిస్తారు. కన్నెపల్లి గ్రామ ఆడపడుచులు, మహిళలు హారతులు ఇచ్చి, నీళ్లు ఆరబోసి, కొబ్బరికాయలు కొట్టి సారలమ్మను మేడారానికి సాగనంపుతారు.
తల్లిని తాకాలనే తపనతో భక్తులు
కన్నెపల్లి నుండి మేడారానికి బయలుదేరిన సారలమ్మను తాకాలనే తపనతో భక్తులు ఎగబడుతుంటారు. వారిని నిలువరించేందుకు వందల సంఖ్యలో పోలీసులు వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తారు. అక్కడి నుండి సారలమ్మ జంపన్న వాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటుంది. సారలమ్మ జంపన్నవాగు (సంపెంగ) దాటుతున్న క్రమంలో వాగులో భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ రెండు చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలుకుతారు. శివసత్తులు తన్మయంతో, భక్తిపారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతారు. కాగా సారలమ్మ గద్దె పైకి రాకముందే ఏటూర్‌నాగారం మండలంలోని కొండాయి నుండి గోవిందరాజులను, కొత్తగూడ మండలంలోని పూనుగోండ్ల నుంచి పగిడిద్ద రాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారానికి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ సహా వీరిని తీసుకువచ్చే ముగ్గురు వడ్డెలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం వారి వారి గద్దెలపై ప్రతిష్టింపజేస్తారు. ఇది మొదటి రోజు మహా ఘట్టం.
(ఫిబ్రవరి 22న రెండవ రోజు గురువారం)
కంకవనం తోడుగా.. ‘కుంకుమ భరిణ’లో గద్దెలకు పయనం
- ‘ఆదిపరాశక్తి’ సమ్మక్క తల్లి ఆగమనం
- మహాజారతలో రెండోరోజు ఫిబ్రవరి 22న (గురువారం) సమ్మక్క తల్లి సాయంత్రం గద్దెపైకి వస్తుంది. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదటగా గిరిజన పూజారులు (వడ్డెలు) మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్ళి కంకవనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్ళీ చిలుకల గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. చిలుకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. మహాజాతరకు ఇదే అత్యంత ప్రధాన ఘట్టం. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకుని పూజారులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె (పూజారి) తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ వందలాది మంది పోలీసులు వలయంగా ఏర్పడి రక్షణగా ఉంటారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం.. తల్లికి స్వాగతం పలుకుతూ జాతర అంతటా కోళ్ళు, మేకలతో మొక్కులు (బలులు) ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భక్తులు, శివసత్తులు తన్మయత్వంతో, పూనకాలతో ఊగిపోతుంటారు. గద్దెల వద్దకు సమ్మక్క చేరే క్రమంలో భక్తులు ఆలయం ఎదురుగా ఎదురుకోళ్ళతో స్వాగతం పలుకుతారు. దేవతను పట్టుకున్న వడ్డెను తాకే ప్రయత్నించే క్రమంలో జనాన్ని అదుపు చేయడం కష్టాసాధ్యమైన పని. సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరణిని గద్దెలపైకి చేర్చుతారు. అనంతరం మహా జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. గద్దెలపై ఆశీనులైన గిరిజన ఆరాధ్యదైవాలు, అడవి తల్లుల(తల్లీబిడ్డలు)ను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా బారులుతీరుతారు. ఇది మహా జాతర ప్రధాన ఘట్టం.
(ఫిబ్రవరి 23 జాతర మూడవ రోజు శుక్రవారం)
గద్దెలపైన ఆసీనులైన వనదేవతలు
గద్దెలపైకి సమ్మక్క-సారమ్మ వనదేవతలు ఆసీనులైన మూడవ రోజు (శుక్రవారం) అశేషభక్తజనానికి దర్శనమిస్తారు. ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చమని తల్లులను వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు అమ్మవార్లకు కానుకలు చెల్లిస్తారు. నిలువుదోపిడీ, ఎత్తుబంగారం, నైవేద్యాలు సమర్పిస్తారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, చీరె, సారె, పెడతారు. ఒడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం నైవేద్యాలుగా పెడతారు. అత్యంత భక్తితో ఉరకలేస్తున్న జనంతో మేడారం పరిసరాలు సందడిగా మారుతాయి. ఈ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకుని పునీతులవుతారు. జాతరలో మేడారానికి ఈ మాడవ రోజు లక్షల్లో భక్తులు జాతరకు వస్తారు.
(మహా జాతర నాలుగోరోజు శనివారం చివరి ఘట్టం)
జనం నుంచి వనంలోకి అమ్మవార్లు
మేడారం మహాజాతరలో నాలుగోరోజు (శనివారం) జనం నుంచి వనంలోకి.. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవింద రాజును కొండాయికి, పగిడిద్ద రాజును పూనుగొండ్లకు కాలనడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది. కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనమిచ్చిన శ్రీ సమ్మక్క-సారలమ్మలు నాలుగో రోజు సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఈ క్రతువు ముగుస్తుంది. సమ్మక్క చిలుకల గుట్టపైకి, సారలమ్మ కన్నెపెల్లికి తరలివెళ్ళిన తర్వాత భక్తులు తిరుగు పయనమవుతారు. అప్పటి వరకు భక్తజన సంద్రంగా ఉన్న మేడారంలో భక్తుల సందడి తగ్గుతుంది. మళ్ళీ రెండేళ్ళపాటు భక్తులు తల్లుల రాక కోసం వేచి చూస్తుంటారు. ఈ నాలుగు రోజులు మేడారం మహాజాతరలో అత్యంత విశిష్టమైన రోజులుగా భక్తులు భావిస్తారు.