Thursday, November 21, 2024

TS – బండెన‌క బండిక‌ట్టి ! జాత‌రంటే మేడార‌మే

జాత‌ర‌లు అంత‌టా జ‌రుగుతాయి.. ఒక్కోచోట‌ ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. కానీ, అస‌లు జాత‌ర అంటే మేడార‌మే అని చెప్పుకోవాలి. ల‌క్ష‌లాదిదిగా త‌ర‌లివ‌చ్చే భ‌క్త జ‌నం.. త‌ల్లుల రాక కోసం తండ్లాడే తీరు.. ఎలాంటి గుడి, గోపురం లేని చోట క‌ర్ర‌కొయ్య‌ల‌ను అమ్మ‌లుగా భావించి మొక్కులు చెల్లించుకునే విధానం.. ఒక్క మేడారం స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ జాత‌ర‌లోనే ప్ర‌త్యేకం. ఇదీ ఒక్క గిరిజ‌నుల‌కే కాదు.. ఇప్పుడు అంద‌రి విశ్వాసంగా మారింది. ఈ న‌మ్మ‌కం కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆచారంగా వ‌స్తోంది. అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర జాత‌ర‌గా ప్ర‌క‌టించి.. ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పిస్తోంది. కానీ. ఒక‌ప్పుడు బండెన‌క బండిక‌ట్టి.. ఎడ్ల‌బండ్ల‌లో సాగే ప్ర‌యాణాలే వేరు. ఎంత హైటెక్కు బ‌స్సు స‌ర్వీసులు. కార్లు వ‌చ్చినా ఆ ఎంజ‌య్‌మెంట్‌ని మ‌రిచిపోలేము అంటున్నారు చాలామంది. ఆ విశేషాలేంటో ఓ సారి చ‌దివి తెలుసుకుందాం.

మేడారం జాతర.. ఒకప్పుడు ఆదివాసీలు, జానపదులు, గ్రామీణులు పాల్గొనే జాతర. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లలో వచ్చేవారు. మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే వారు ప్రధానంగా గ్రామీణ గిరిజనులే ఉండేవారు. తమ ఎడ్ల బండ్లను జంపన్న వాగులో పారే నీటిలో నుంచి దాటుతూ మేడారంలోకి అడుగుపెట్టేవారు. దీనివల్ల పవిత్ర జంపన్న వాగు జలాలను తాకడంతో తమ గొడ్డు, గోదాతోపాటు తాము కూడా ఆరోగ్యంగా ఉంటామనేది ప్రగాఢ విశ్వాసం. కాలక్రమేణా.. జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది.

విప‌రీత‌మైన ట్రాఫిక్‌..
2000 సంవత్సరానికన్నా ముందు మేడారానికి వచ్చే బస్సుల సంఖ్య రెండున్నర వేలు మాత్ర‌మే ఉండేది. ప్రస్తుతం ఈ బస్సుల సంఖ్య ఆరు వేలకు పెరిగింది. మేడారానికి వచ్చే రహదారుల్లో విపరీతమైన వాహనాల ట్రాఫిక్ ఉండడం, తరచూ ప్రమాదాలతో ఎడ్ల బండిలో ఉండే మూగ జీవాలు ప్రమాదానికి గురయ్యేవి. ఈ కారణం చేత మేడరానికి ఎడ్ల బండ్ల ద్వారా వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత రెండు జాతరల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా వచ్చే వారి సంఖ్య వందలకు పడిపోయింది. దీంతో పాటు, 2012లో మొదటి సారిగా హెలికాఫ్టర్‌ను కూడా ప్రవేశ పెట్టారు.

మూడు రోజులూ అక్క‌డే మ‌కాం..

1994 జాతర వరకూ భారీ సంఖ్యలో గ్రామీణులు, గిరిజనులు ఎడ్ల బండ్లలోనే వచ్చేవారు. జాతర ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందుగానే ఎడ్ల బండ్లలో మేడారం వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకొని సారలమ్మ, సమ్మక్క గద్దెలపై ప్రతిష్టాపన అయిన అనంతరం మూడోరోజు పూర్తి స్థాయి దర్శనం చేసుకున్న అనంతరమే తిరిగి వెళ్తారు.

25వేల‌కు పైగా ఎడ్ల బండ్లు..

- Advertisement -

1994లో జరిగిన మేడారం జాతరకు 25వేలకు పైగా ఎడ్ల బండ్లు వచ్చాయని అంచనా ఉంది. అయితే, 1996 నుంచి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నానఘట్టాలు నిర్మించడం, క్రమక్రమేణా మొత్తం జంపన్న వాగు పొడవునా నిర్మించడంతో వాగు దాటి మేడారానికి ఎడ్ల బండ్లు వచ్చే అవకాశం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో, ఎడ్ల బండ్ల సంఖ్య 90శాతం తగ్గింది. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుంచి మేడారం చేరుకోవాలనే స్థానిక గిరిజనుల విశ్వాసం. అయితే.. స్నానఘట్టాలు నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లు జాతరకు వస్తున్నాయి.

జంప‌న్న‌వాగుపై బ్రిడ్జి.. ఎడ్ల బండ్ల‌కు అంత‌రాయం..

కాగా, స్థానిక గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై 2002లో బ్రిడ్జిని నిర్మించారు. దీంతోపాటు వాగు పొడుగునా స్నాన ఘట్టాలను దాదాపుగా ఊరట్టం క్రాస్ రోడ్డు వరకు నిర్మించారు. ఇట్లా ఎడ్ల బండ్ల ద్వారా మేడారం వచ్చే ఆదివాసీ గిరిజనులు, గ్రామీణులు బండ్ల‌పైన‌ రావడమే తగ్గించారు. మేడారం జాతర ప్రస్థానం ఎడ్ల బండి నుంచి హెలికాఫ్టర్ వరకు మారింది. అయినప్పటికీ, ఇప్పటికీ రాష్ట్ర పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, కన్నెపల్లి, రెడ్డిగూడెం తదితర పరిసర గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వాటికి తగు వ్యాధుల నిరోధక మందులను ఇవ్వడం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement