తెలంగాణ శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రకటన నేడు వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. దీంతో రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు నోటిఫికేషన్ విడుదలకు ముందు శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి గవర్నర్ తమిళ సై నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంది. అనుమతి అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. మండలిలో సభ్యుల సంఖ్య పరంగా టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. బలం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కాగా, శాసన మండలికి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.