Tuesday, November 26, 2024

లీకేజ్ లో రాజ‌కీయ కుట్ర‌ – ఎ2 బిజెపి కార్య‌క‌ర్త … కెటిఆర్ ట్విట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ పార్టీ కార్యకర్త అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడె ంట్‌, మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అని నిరూపిస్తూ ఫోటోలతో సహా పాటిమీది జగన్‌ అనే నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ కేటీఆర్‌ రిట్వీట్‌ చేశారు. ఈ విషయంలో తగిన దర్యాప్తు నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. రాజకీయ పార్టీగా బీజేపీ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిణామం ఆ పార్టీ మరింత దిగజారుడు రాజకీయా లకు నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీజేపీ పార్టీ నిరుద్యోగ యువత భవిష్యత్‌ను ఫణంగా పెట్టి కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తగిన విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు.


అంతకుముందు… పాటిమీది జగన్‌ అనే నెటిజన్‌ … ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏ2 నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేశారు. గడిచిన పలు ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేశారని , అందుకు తగిన ఫోటోలతో కూడిన ఆధారాలతో ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ఖండించగలదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏ2 నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బండి సంజయ్‌, కిషన్‌రెడ్డికి అత్యంత ప్రధాన అనుచరుడు అని కూడా ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ కండువా కప్పుకుని రాజశేఖర్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్న ఫోటోను, బీజేపీకి ఓటు వేయాలని, అబ్‌కీబార్‌ మోడీ సర్కార్‌ అనే నినాదంతో కూడిన పోస్టర్‌లో రాజశేఖర్‌రెడ్డి ఉన్న ఫోటోను ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. దే శ భక్తి మా విధానం, నిజాయితీ మా మార్గం, అభివృద్ధి మా లక్ష్యం అని బీజేపీ చెబుతున్న ప్రచార కరపత్ర ఫోటోను ట్వీట్‌కు ట్యాగ్‌ చేసి ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు.

టీఎస్‌పీఎస్పీ ప్రశ్నాపత్రాల కేసులో రాజశేఖర్‌రెడ్డి ప్రమేయమే కీలకం. ప్రశ్నాపత్రాల లీకేజీకి పథక రచన చేసింది ప్ర్‌వీణ్‌ అయితే… దాన్ని అమలు చేసింది రాజశేఖర్‌రెడ్డినే. ఏకంగా కమిషన్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి ప్రశ్నాపత్రాలను డౌన్‌ లోడ్‌ చేసి పెన్‌డ్రైవ్‌ లో వేసి ప్రవీణ్‌కు రాజశేఖర్‌రెడ్డి ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి ప్రమేయం లేకపోతే ప్రశ్నాపత్రాలు లీకయ్యేవే కావన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ కేసును కీలక మలుపు తిప్పింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీని ముట్టడించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, అసలు ఈ కేసులో ఏ2 నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది..? అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement