Monday, November 18, 2024

TS: హుజురాబాద్‌ ఎలక్షన్‌ చాలా కాస్ట్‌ లీ గురూ? అంతుచిక్కని ఓటర్ల నాడీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రచార పర్వం, కరెన్సీ కవర్లు గోలలు అన్నీ ముగిశాయి. హుజూరాబాద్‌ ఓటరు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళి ఈవీఎం మీట నొక్కి తన తీర్పు చెబుతున్నారు ఓటర్లు. 2.36 లక్షల ఓటర్లున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో.. ఫలితంపై ఒక్క తెలంగాణలోనే కాక పొరుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి ఉంది. హుజురాబాద్‌లో ఇన్నాళ్లుగా సాగించిన ప్రచారం ఒక ఎత్తయితే పోలింగ్‌ రోజులో ఉన్న సమయాన్ని సద్వినియోగపర్చు కోవాలనే వ్యూహాల్లో ప్రధాన పార్టీలు మునిగి తేలాయి. ఓటర్ల చుట్టూ జరుగుతున్న లాబీయింగ్‌లో పైచేయి సాధించాలనే తపనను చూపాయి. ఇందుకోసం ఇప్పటికే తెరతీసిన ప్రలోభాలకు అదనంగా కొన్నివర్గాల ఓట్లను ఎలా తమవైపునకు తిప్పుకోవాలనే విషయంలో ఆయా పార్టీలు వ్యూహాలు రచించాయి. ఆయా పార్టీల తరఫున ఇక్కడి నియోజకవర్గానికి వచ్చి ఇన్నాళ్లుగా మకాం వేసిన నేతలంతా కోడ్‌ నిబంధనల మూలంగా సమీపంలోని సరిహద్దు మండలాల నుంచి మంత్రాంగాన్ని నడిపించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా ఉంటున్న నేతలతో ఫోన్‌లో సంభాషిస్తూ తగు సూచనల్ని అందించారు.

ఎవరి ధీమా వారిదే
పోలింగ్‌ సందర్భంగా ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ బలహీనప్రాంతాలపై, ప్రత్యర్ధి పట్టు సాధించాడని భావిస్తున్న ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టారు. మూడురోజులుగా హుజూరాబాద్‌లో ప్రజలు రోడ్లెక్కి తమకు పైసలు అందలేదని, తక్కువ వచ్చాయని గొడ వలు చేస్తుండగా.. పార్టీల నుంచి డబ్బు అందని ఓటర్లు రోడ్డెక్కి ధర్నాలకు దిగటం ఈ ఎన్నికల్లో హైలెట్‌. ఇలాంటివి గతంలో ఎన్నడూ జరగలేదు. హుజురాబాద్‌ పట్టణంలోని ఐదో వార్డులో ఓ పార్టీకి చెందిన గల్లిd లీడర్లు.. ఓటర్లకు డబ్బు పంపిణీ చేపట్టారు. చేతుల్లో లిస్టులు తీసుకుని ఇంటింటికి తిరుగుతూ.. ఓటుకింత అంటూ పంపకాలు చేపట్టారు. కొందరికి ఓటుకు 1500 చొప్పున ఇవ్వగా.. మరికొందరికి కేవలం 500 మాత్రమే ఇచ్చారు. అంతా బాగానే ఉందని చేతులు దులుపుకుని వెళ్లి పోదామనుకునేలోపే.. పలువురు ఓటర్లు వాళ్లను నిలదీశారు. కొందరికి 1500 ఇచ్చి.. తమకు మాత్రం రూ.500 ఎందుకు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇస్తే అందరికీ ఒకేలా ఇవ్వాలి కానీ.. ఇలా బేషజాలు చూపెడుతూ.. ఇవ్వడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకొందరైతే.. తమకు అసలు ఒక్క రూపాయి కూడా అందలేదని అక్కసు వెళ్ళగక్కారు. ఈ పంపిణీ వ్యవహారాలు, ఓటర్ల నిరసనలపై ఎన్నికలసంఘం సీరియస్‌ అయ్యింది.

ఫేక్‌ వీడియోలు.. ఫేక్‌ ప్రచారాలు
ఎన్నికల షెడ్యూల్‌కు ముందునుండే ఫేక్‌ ప్రచారాలు మొదలు కాగా, ఆఖర్లో ఫేక్‌ వీడియోలు, వాట్సాప్‌ సందేశాలు వైరల్‌గా మారాయి. ఆర్థికమంత్రి టి.హరీష్‌రావు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నారని ప్రైవేట్‌ చానల్‌ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, సదరు న్యూస్‌ చానల్‌లపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వార్తల క్లిప్పింగ్‌ ఉద్దేశపూర్వకంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అవకాశాలను దెబ్బతీస్తుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నకిలీ లేఖకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఒక దానిపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

ఖరీదైన ఉప ఎన్నిక
హుజురాబాద్‌ ఉప పోరులో నగదు ప్రవాహాన్ని యావత్‌ దేశం చూసింది. దీనిని అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. డబ్బు పంపకాల వీడియోలు చూసిన వారికి ఇది నిజమే అనిపిస్తుంది. తనను, అధికారాన్ని ప్రశ్నించిన ఈటల రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పనిచేసింది. ఫలితంగా హుజురాబాద్‌లో వందల కోట్ల నిధులు తరలివెళ్లాయి. ఇదే చాన్స్‌ అని ఓటర్లు నోట్ల పండుగ చేసుకుంటున్నారు. తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధిక ఖర్చు పెట్టిన ఎన్నికగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ రోజు పోలింగ్‌ కొనసాగుతుండగా, మంగళవారం కౌంటింగ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement