Thursday, November 21, 2024

ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్ రద్దు… ఒక్క ఛాన్స్ కావాలంటున్న యాజమాన్యాలు!

కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తోంది. కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు. డీహెచ్‌ శ్రీనివాస్‌రావుతో ఆయా ఆసుపత్రుల యజమానులు వేర్వేరుగా భేటీ అవుతున్నారు.

తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్‌ రద్దు చేయడంపై చర్చించడంతోపాటు ఫిర్యాదు చేసిన పేషెంట్స్‌ బిల్‌ కాపీలను డీహెచ్‌కు మరోసారి అందజేశారు. తమ ఆస్పత్రులను మంచి రెప్యుటేషన్‌తో నడుపుకుంటున్నామని అది పోవాలని కోరుకోవడం లేదని వారు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున లైసెన్స్ రద్దు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని డీహెచ్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు వివరించారు. తమ ఆస్పత్రుల లైసెన్స్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

కాగా, కరోనా కష్టకాలంలో వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు బాధితులను లక్షల రూపాయలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ కొరడా ఝులిపించింది. ఆరు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల లైసెన్స్‌ను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది. సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది. అలాగే బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్‌ ఆసుపత్రి, ఎల్బీనగర్‌లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆస్పత్రులపై కొవిడ్‌ ట్రీట్‌మెంట్ రద్దు చేసింది. ఇప్పటివరకు 114 ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఆనందయ్య కంటిమందుపై తీర్పు రిజర్వ్

Advertisement

తాజా వార్తలు

Advertisement