Friday, November 22, 2024

బ‌స్సుల‌ను ఢీ కొన్న ట్ర‌క్కు.. 14మంది మృతి.. మృతుల కుటుంబాల‌కి రూ.10ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం

రోడ్డుప‌క్క‌న ఆగి ఉన్న మూడు బ‌స్సుల‌ను సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ట్ర‌క్కు ఢీ కొట్టింది.ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. కాగా ఈ ఘ‌ట‌న‌లో 60మంది గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్యప్రదేశ్ రేవా-సత్నా సరిహద్దు బర్ఖాడా గ్రామ సమీపంలో జరిగిందని అధికారులు తెలిపారు. బస్సుల్లోని వ్యక్తులు సత్నా నగరంలోని ‘కోల్ మహాకుంభ్’ నుండి తిరిగి వస్తున్నారట‌. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) డాక్టర్ రాజేష్ రాజోరా వెల్ల‌డించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సిద్ధి, రేవా జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాజోరా తెలిపారు.

గాయపడినవారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారని చెప్పారు. రేవా మెడికల్ కాలేజీ, సిధి జిల్లా ఆసుపత్రిని అప్రమత్తంగా ఉంచాలని సీఎం కోరినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జ‌ర‌గ‌టం దురదృష్టకరం అని పేర్కొన్న చౌహాన్.. అవసరమైతే, మెరుగైన చికిత్స కోసం బాధితులను ఇక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేస్తామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందజేస్తామని కూడా చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయనున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబీకులకు కూడా పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement