Thursday, January 16, 2025

Truce – గాజా రిలాక్స్‌! అమ‌లులోకి కాల్పుల విరమణ

అంగీకారం తెలిపిన ఇజ్రాయెల్, హమాస్
ట్రంప్ చొర‌వ‌తో కుదిరిన స‌యోధ్య‌
మ‌ద్య‌వ‌ర్తిత్వం నెరిపిన అమెరికా, ఖతార్
బందీల విడుద‌ల‌కు స‌న్నాహాలు
పాల‌స్తీనీయుల‌కు అవ‌స‌ర‌మైన సాయం
మూడు ద‌శ‌లుగా శాంతి ఒప్పందాలు
చ‌ర్చ‌లు జ‌రిపి ప‌రిష్క‌రించుకోనున్న ఇరు దేశాలు
ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు
జెండాలు ఎగ‌రేసి సంబురాలు చేసుకున్న పాల‌స్తీనా ప్ర‌జ‌లు
బాధ‌ల‌న్నీ మ‌రచిపోలేము.. ఎవ‌రినీ క్ష‌మించ‌బోమ‌న్న హ‌మాస్ చీఫ్‌

ఆంధ్ర‌ప్ర‌భ, సెంట్ర‌ల్ డెస్క్‌: గాజాలో యుద్ధం ఆగిపోతోంది. దీంతో పాలస్తీనీయులకు అవసరమైన మానవీయ సాయం అందుతుంది. బందీలుగా ఉన్న‌వారు వారి వారి కుటుంబ సభ్యులను క‌లిసేందుకు ఏర్పాట్లు చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ ఒప్పందానికి మద్దతిచ్చిన జో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఇది పాలస్తీనా ప్రజల మనో ధైర్యానికి దక్కిన ఫలితంగా భావిస్తున్నామ‌ని హమాస్ లీడ‌ర్ ఖలీల్ అల్-హయ్యా అన్నారు. కాగా, ఈ వార్త తెలిసిన వెంట‌నే పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ బందీల బంధువులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు. అయితే.. గాజాలో దాడులు మాత్రం ఆగలేదు. తాజా ఒప్పందం గురించి ఖతార్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 20 మంది ప్రజలు చనిపోయారని హమాస్ నాయకత్వంలోని పౌర రక్షణ సంస్థ తెలిపింది. కానీ, ఈ ఆరోపణల మీద ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

2023 నుంచి కొన‌సాగుతున్న యుద్ధం..

- Advertisement -

2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి దాదాపు 1200 మందిని చంపి, 251 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. దీంతో హమాస్‌ను అంతమొందిస్తామంటూ ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో యుద్థం ప్రారంభించింది. ఈ యుద్ధంతో గాజాలో ఇప్పటి దాకా 46,700 మందికి పైగా చనిపోయారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీలు

ఇజ్రాయెల్ దాడులతో 23 లక్షల మంది నిర్వాసితులయ్యారని, భారీగా విధ్వంసం జరిగిందని హమాస్ చెబుతోంది. గాజాలో ప్రజలకు ఆహారం, ఇంధనం, ఔషధాలు, వసతితో పాటు అనేక మందికి అత్యవసర సాయం అవసరమని హమాస్ అంటోంది. హమాస్ దగ్గర ఇంకా 94 మంది బందీలుగా ఉన్నారని, అందులో 34 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. వీరితో పాటు యుద్ధానికి ముందు హమాస్ వద్ద ఉన్న నలుగురు ఇజ్రాయెలీలలో ఇద్దరు చనిపోయారని తెలిపింది.

తొలి దశలో (మొదటి ఆరు వారాలు)..

కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి ముందు ఇరు వర్గాలు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ ప్రధానమంత్రి కోరారు. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బందీలను విడుదల చేస్తారని అన్నారు. బందీల్లో మహిళలు, పిల్లలు, వృద్దులు ఉన్నారు. గాజాలో జన సాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోంది. నిరాశ్రయులైన పాలస్తీనీయులు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. ఇకపై ఇక్కడికి ప్రతి రోజూ మానవీయ సాయం కింద సరుకులు తీసుకొచ్చే లారీలు రానున్నాయి.

రెండో దశ చర్చలు..

భాగంగా మిగతా బందీలను విడుద‌ల.. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల పూర్తి ఉపసంహరణ.. ప్రశాంతత పునరుద్దరణ వంటి అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతాయి. ఈ చర్చలు జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.

మూడోది, చివరి దశ..

ఈ ద‌ఫా చర్చల్లో భాగంగా గాజా పునర్నిర్మాణం, మిగిలిన బందీల అప్పగింతపై చర్చిస్తారు. కాగా, రెండు, మూడు దశలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణ సిద్ధంగా ఉంద‌ని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ అన్నారు. చర్చించాల్సిన అంశాలు ఖరారైన తర్వాత రెండు రోజుల్లో చర్చలకు సంబంధించిన ఒప్పందాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ఇక‌.. ఈ చర్చల్లో మధ్యవర్తులుగా ఉన్న ఖతార్, అమెరికా, ఈజిప్టు దేశాలు ఈ ఒప్పందంలోని అంశాలు అమల్లోకి వచ్చేలా చూస్తాయని ఆయన చెప్పారు.

ట్రంప్​ ఇంట్రెస్ట్​తోనే ఇదంతా..

కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రణాళిక ఎనిమిది నెలల క్రితమే సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మేము ఈ వార్తను స్వాగతిస్తున్నప్పటికీ, అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడిలో చ‌నిపోయిన‌ వారి కుటుంబాలను కూడా గుర్తుంచుకుంటాం. అలాగే.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల కుటుంబాల‌ను ఆదుకుంటాం అని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో జో బైడెన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం కుదరడంలో కాబోయే అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అందించిన సాయాన్ని గుర్తుచేశారు. సోమవారం తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే బందీలను విడుదల చేసేలా ట్రంప్ ఇరు పార్టీల మీద ఒత్తిడి తెచ్చారని బైడెన్ చెప్పారు. దీనికోసం కొన్ని రోజులుగా తామంతా ఒక బృందంగా పని చేస్తున్నామ‌ని బైడెన్ అన్నారు.

ట్రంప్​కు థ్యాంక్స్​ చెప్పిన నెతన్యాహూ..

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని ముందుగా డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత వైట్ హౌస్, ఖతార్ ప్రకటన చేశాయి. బందీల విడుదలకు మద్దతిచ్చినందుకు ధన్యావాదాలు అంటూ ఇజ్రాయెల్ ప్రధానమత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపింది. బందీలంతా స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నార‌ని ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఒప్పందంలో పేర్కొనాల్సిన పూర్తి వివరాలపై కసరత్తు జరుగుతోందని, అది పూర్తైన తర్వాతే ఒప్పందం బయటకు వస్తుంద‌ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

అవన్నీ మరిచిపోలేము.. ఎవరినీ క్షమించము..

ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చెయ్యబోయే పాలస్తీనా ఖైదీల జాబితాను ప్రకటిస్తారు. వారి కుటుంబ సభ్యులు ఏదైనా చెప్పాలనుకుంటే 48 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్లో కొంత మంది హత్య, తీవ్రవాదం వంటి నేరాలకు గాను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. శత్రువుతో పోరాటంలో ఇది ఒక మైలు రాయి. మన ప్రజల స్వేచ్చ, పునరాగమనం లక్ష్యంగా సాగుతున్న యుద్ధంలో కీలక మలుపు అని హమాస్ తరపున చర్చల్లో పాల్గొన్న గాజా చీఫ్ ఖలీల్ అల్- హయ్యా చెప్పారు. ఇక‌.. గాజా పునర్నిర్మాణం, బాధల‌ను తొలగించడం, గాయాలను మాన్పడంపై హమాస్ దృష్టి పెడుతుందని చెప్పారు. అదే సమయంలో గాజాలో పాలస్తీనీయులు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, బాధలను గుర్తు చేస్తూ.. మేం వాటిని మర్చిపోం, ఎవరినీ క్షమించం’ అన్నారు.

జెండాలు ఎగరేసి సంబరాలు..

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తెలియగానే సెంట్రల్ గాజా పట్టణం దీర్ అల్ బలా, ఖాన్ యూనిస్‌లో పాలస్తీనా జెండాలు ఎగరేసి జనం వేడుక చేసుకున్నారు. బందీల బంధువులు కూడా తమ వారు విడుదల అవుతారని హర్షం వ్యక్తం చేశారు. యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన వారికి, కష్టాలు ఎదుర్కొన్న వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement