రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే… ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి… ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారని మండిపడ్డారు.
ప్రధాని వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. మోదీ వ్యాఖ్యల పట్ల ఇవాళ అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేసి, నల్లజెండాలతో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు సూచించారు.