కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం పోరుబాట పట్టింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ ఇవాళ మహాధర్నాకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న ధర్నాలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ధర్నా అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ధర్నా తర్వాత కేంద్రం నుంచి స్పందనను చూసి.. రాష్ట్రంలో పంటల విధానంపై రెండు, మూడు రోజుల్లో విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈనెల 20వ తేదీ వరకు కేంద్రం స్పందన కోసం ఎదురు చూస్తామని.. వారి నుంచి ఉలుకు పలుకు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు స్పష్టమైన వైఖరి వెల్లడిస్తామని చెప్పారు.
మరోవైపు ఏడాదికి తెలంగాణ నుంచి ఎంత బియ్యం కొనుగోలు చేస్తారో స్పష్టతనివ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రెండు పేజీల లేఖను రాసారు. తెలంగాణ ఏర్పడిన 2014 నుంచి వ్యవసాయరంగంలో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందన్నారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయం దృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి 10,000 రూపాయల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, తెలంగాణ తన అవసరాలను దాటుకొని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily