తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పార్టీల మధ్య కాక రేపుతోంది. త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉపఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. సాగర్ ను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు పక్కా వ్యూహాలు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్.. తమ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డిని ప్రకటించి.. జనగర్జన పేరుతో ఓ సభను కూడా పెట్టింది. టీఆర్ఎస్, బీజేపీ మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు.
అభ్యర్థిని ఎంపిక చేయడం అధికార టీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారింది. సర్వేలు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ గొప్పగా చెబుతున్నా.. ఉప ఎన్నిక సెంటిమెంట్ మాత్రం తెగ భయపెడుతోంది. దివంగత నేత నోముల కుమారుడు భగత్‌కు టికెట్ ఇచ్చేందుకు అన్ని సమీకరణాలు అనుకూలంగా ఉన్నా.. గత అనుభవాలు మాత్రం చేదు ఫలితం ఇవ్వడంతో ఆయనకు టికెట్ ఇవ్వాలా వద్దా అని తర్జనభర్జనపడుతోంది.
తెలంగాణలో ఇప్పటివరకూ ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే.. ఉప ఎన్నికల్లో దాదాపు అదే నేత కుటుంబానికి చెందిన సభ్యులకే టికెట్ ఇస్తూ వస్తున్నారు. సానుభూతి కలిసొచ్చి, పార్టీ గెలుస్తుందన్న ఆశ, అంచనాలతో మరో ఆలోచన లేకుండా అవకాశం ఇస్తున్నారు. అయితే తెలంగాణలో ఎందుకో ఆ సెంటిమెంట్ వర్కవుట్ కావడం లేదు. నారాయణఖేడ్ నుంచి… మొన్నటి దుబ్బాక స్థానానికి జరిగిన ఉప ఎన్నిక వరకూ ఏ పార్టీ కూడా సిట్టింగ్ సీటును కాపాడుకోలేకపోయింది. ఆ వరుసలో ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక వచ్చింది. నోముల కుమారుడు భగత్‌కు టికెట్ ఇచ్చేందుకు… పార్టీ నేతల నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవు. కానీ అనాదిగా వస్తున్న ఈ సెంటిమెంటే ఇప్పుడు సవాల్‌గా మారింది. భగత్‌కు టికెట్ ఇవ్వాలా వద్దా అన్నది తర్జన భర్జన పడిన కేసీఆర్.. చివరికి ఆయనకే టికెట్ ఇచ్చేందుకు సముఖ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు భగత్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. మధ్యాహ్నం తర్వాత పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు గత సెంటిమెంట్ వెంటాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నుమూసిన నేపథ్యలో అదే కుటుంబానికి సంబంధించిన వారికే టికెట్ ఇచ్చి గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ రిస్క్ చేస్తున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేటి రామలింగారెడ్డి మరణించడంతో ఆయన కుటుంబానికే కేసీఆర్ టికెట్ కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో భారీగా నష్టపోయిన టీఆర్ఎస్.. ఆ తరవాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించి మళ్ళీ పట్టు నిలుపుకుంది. మరోవైపు దుబ్బాక తరహాలోనే సాగర్ ను దక్కించుకోవాలని బీజేపీ ప్రణాళిక రచిస్తోంది.
ఈ సారి ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే త్రిముఖ పోటీ జరగనుంది. ఇన్ని రోజులు.. టీఆర్ఎస్ ప్రకటన కోసం ఎదురు చూసిన బీజేపీ..ఇప్పుడు తమ అభ్యర్థిని ప్రకటించే పనిలో పడింది. అయితే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో బండి సంజయ్ సీనియర్లతో చర్చలు జరిపారు. అలాగే ఆశావహులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి రేసులో అంజయ్య యాదవ్, నివేదితా రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, రవి నాయక్ ఉన్నారు. వీరిలో ఎవరి ఖరారు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు సాగర్ ఉపఎన్నికల్లో తాను పోటీ చేయనని ఇప్పటికే తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. దీంతో ఈ మూడు పార్టీల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. కాగా ఏప్రిల్ 17న ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది.