Saturday, November 23, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ ముందున్న ఆప్షన్ ఏంటి?

భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఊహించిన విధంగానే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే, బీజేపీలో చేరడానికి ముందు ఈటల ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఈ తంతు కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. రాజీనామా చేసిన తరువాత బీజేపీలో అట్టహాసంగా చేరాలని భావిస్తున్నా, కోవిడ్‌ కారణంగా కొద్దిమందితోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ఈటల రాజీనామా స్పీకర్ కు పంపిస్తే.. దానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. దీంతో ఉప ఎన్ని అనివార్యం కానుంది.

రాజీనామా చేసిన ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ఈటల ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆరునెలల్లో ఉప ఎన్నిక నిర్వహణకు ఇబ్బంది ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈటల రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ ప్రజాప్రతినిధులెవరూ ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేస్తోంది. ఈటల బీజేపీలో చేరడం ఖాయమవడంతో ‘ఆపరేషన్‌ హుజూ రాబాద్‌’ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు.

ఈటల పార్టీ మారనుండడంతో హుజూరాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఈటల రాజేందర్‌ 17 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌పై టీఆర్‌ఎస్‌కు పట్టు సడలలేదని చెప్పేందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ త్వరలోనే ఈ నియోజకవర్గంలో తిష్టవేసి కార్యక్రమాలను కొనసాగించనున్నారని సమాచారం. మండలాల వారీగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడం, అయిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయించడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనే సంకేతాలు పంపించనున్నారు. ఫలితంగా ఉప ఎన్నికలో తిగిరి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఇప్పటికే హుజూరాబాద్‌ నేతలతో పార్టీ ఇన్‌చార్జీల భేటీలు ముమ్మరం అయ్యాయి. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత దొంతు రమేశ్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. బీజేపీలో ఈటల చేరిక ఖరారైన తర్వాతే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. తాజా పరిణామాల నేపథ్యం లో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 90 శాతం పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ వెంటే ఉం టామని ప్రకటించారు. ఈటల బీజేపీలో చేరినా ఆయన వెంట పార్టీ ప్రధాన నేతలెవరూ లేకుండా చూడాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సంస్థాగతంగా బీజేపీకి అంతగా బలంగా లేకున్నా ఆ పార్టీకి ఉన్న ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎదురు ఉండదనే పార్టీ నాయకులు ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.  

- Advertisement -

ఇది కూడా చదవండి: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు నియామకం..

Advertisement

తాజా వార్తలు

Advertisement