Friday, November 22, 2024

మున్సిపాలిటీల్లో గులాబీ జెండా.. దూసుకెళ్లిన కారు

తెలంగాణలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో కారు దూసుకెళ్లింది. కారు జోరుకు ఎదురే లేకుండా పోయింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌లు సహా నకిరేకల్‌, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల,‍ కొత్తూరు పురపాలికలను కైవసం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోటీ ఇవ్వగా.. వరంగల్‌ లో బీజేపీ, ఖమ్మంలో కాంగ్రెస్‌ రెండోస్థానంలో నిలిచాయి. 

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు నగరపాలికలో జయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్… కారు జోరు తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు గానూ అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు 48 డివిజన్లలో విజయం సాధించారు. బీజేపీ 10,  కాంగ్రెస్ 4 చోట్ల విజయం సాధించారు. ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.

ఖమ్మం కార్పొరేషన్‌ ను టీఆర్ఎస్ మరోసారి నిలబెట్టుకుంది. మొత్తం 60 డివిజన్లలో 46 స్థానాల్లో టీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్-సీపీఎం కూటమి అభ్యర్థులు 11 చోట్ల గెలుపొందారు. బీజేపీ ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. మొత్తం 60 డివిజన్లకుగాను.. 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం 10వ డివిజన్‌ టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది.

సిద్దిపేట మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీ విజయదుందుభి మోగిచింది. మొత్తం 43 స్థానాల్లో టీఆర్ఎస్ 36 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల విజయం సాధించారు. బీజేపీ, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వార్డులోనూ ఖాతా తెరవలేదు.

మరోవైపు జడ్చర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 27 వార్డులకు గాను 23 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని పురపాలిక పీఠాన్ని ఖాతాలో వేసుకుంది. జడ్చర్లలో కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండో వార్డుల్లో గెలిచాయి. జడ్చర్ల ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా గెలిచిన అభ్యర్థుల్లో 8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక అచ్చంపేటలోనూ టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, ఆరు వార్డులను కాంగ్రెస్, ఒక్క స్థానంతో బీజేపీ గెలిచాయి. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ జనరల్ కు  కేటాయించగా 16వ వార్డు నుంచి గెలిచిన నర్సింహ గౌడ్ రేసులో ఉన్నారు.

- Advertisement -

ఇక, కొత్తూరు పురపాలిక ఛైర్మన్ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీనే హస్తగతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 7 చోట్ల విజయం సాధించింది. ఐదు వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు చేజిక్కించుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ పోరులోనూ సత్తా చాటింది. మొత్తం 20 వార్డులుండగా 11 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి పురపీఠాన్ని దక్కించుకున్నారు. ఆరు వార్డుల్లో ఫార్వర్డ్ బ్లాక్, రెండింట కాంగ్రెస్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నిజామాబాద్ జిల్లా బోధన్ పురపాలికలోని ఒక్కో వార్డుకు జరిగిన ఉపఎన్నికలోనూ అధికార పార్టీ అభ్యర్థులే జయకేతనం ఎగురవేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉపపోరులో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి రాజ శేఖర్రెడ్డి విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి అఖిల్ గౌడ్ పై 1272 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement