Sunday, November 17, 2024

హుజూరాబాద్ పాలిటిక్స్.. టీఆర్ఎస్ వైపు కాషాయ నేతలు!?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కావడం లేదు. మాజీ మంత్రి ఈటల వ్యవహారం అనంతరం హుజూరాబాద్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈటలని ఒంటరిక చేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని దారులు అన్వేషిస్తోంది. నియోజకవర్గంలో ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు రెండు వ‌ర్గాలుగా కేడ‌ర్ చీలిపోయింది. వీరిద్ద‌రి మ‌ధ్య‌నే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు న‌డిచాయి. అయితే ఇప్పుడు మ‌ధ్య‌లోకి బీజేపీ ఎంట‌ర్ అయింది. ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ… టీఆర్ఎస్ ఇప్పుడు కాషాయ పార్టీపై ఫోకస్ పెట్టింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడ‌ర్‌ను మొత్తం త‌మ‌వైపు తిప్పుకున్న అధిష్టానం.. ఎలాగైనా ఈట‌ల‌ను ఒంటరి చేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ఈట‌ల వెంట ఉంటున్న వారితో చర్చలు కూడా జరిపింది. ఈ విషయంలో మంత్రి హరీష్ రావు కీలకంగా వ్యవహారించారు. అయితే, ఈటల బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుండడంతో బీజేపీని ఖాళీ చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసింది.

ఇప్ప‌టికే బీజేపీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ దండ శోభ, 18వ వార్డు కౌన్సిలర్‌ ప్రతాప మంజూలలు టీఆర్‌ఎస్ కండువా క‌ప్పుకున్నారు. వారితో పాటు సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సింగిల్‌ విండో డైరెక్టర్లు దండ భాస్కర్‌రెడ్డి, ప్రతాప ఆంజనేయులు గులాబీ గూటికి చేరారు. దీంతో ఈట‌ల‌కు ఏ పార్టీలో చేరినా కేడ‌ర్ లేకుండా చేయాల‌ని టీఆర్ఎస్ చూస్తోంది.

మరోవైపు ఈటల చేరికపై బీజేపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటలతో మరో ఉప్పెన తప్పదని ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ మొదలు పెట్టడంతో హుజూరాబాద్ రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement