Tuesday, November 19, 2024

ఢిల్లీలో కొత్త బిల్డింగ్..రాష్ట్రంలో జెండా పండుగ..

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పండగ వాతారణ నెలకొంది. ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్‌ పార్టీ. సంస్థాగత నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది గులాబీ పార్టీ. ఈనెలలో మొత్తం పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇవాళ జెండా పండుగను వాడ వాడలా నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలు కానుంది. నేటి నుంచి 12 వరకు గ్రామ పంచాయతీ, వార్డు కమిటీల ఏర్పాటు జరగనుంది. తర్వాత 20 వరకు మండల, పట్టణ కమిటీలు… అనంతరం జిల్లా కార్యవర్గాలు, అధ్యక్షుల ఎంపిక సాగనుంది. చివర్లో రాష్ట్ర కార్యవర్గాన్ని కేసీఆర్‌ ప్రకటించనున్నారు. మొత్తంగా ఈ నెలలో పార్టీకి సంబంధించిన అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది టిఆర్ఎస్. ఇటు గ్రేటర్ హైదరాబాద్‌లో 150 డివిజన్లకు కమిటీలతో పాటు నగరంలో ఉన్న స్లమ్స్ కు బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే పార్టీ కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఉంటేనే ఆ కమిటీలు చెల్లుబాటు అవుతాయని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఇవాళ గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

ఇక హస్తినలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్‌ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంట‌ల‌కు ఢిల్లీ వ‌సంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్ మెట్రో స్టేష‌న్ ప‌క్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం 1300 గ‌జాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణం జరగనుంది. సాధారణంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో.. కనీసం ఏడుగురు ఎంపీలు ఉన్న పార్టీలకు.. కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో 1300 గజాల స్థలాన్ని కేటాయించింది గృహనిర్మాణ శాఖ. మరోవైపు గత రాత్రి సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంపీ నామా విందు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:పాము విషంతో కరోనాకు చెక్..

Advertisement

తాజా వార్తలు

Advertisement