గిరిజన రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లును ఇంకా రాలేదని కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి చెప్పడం దారుణం అని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో కేంద్రమంత్రి తీరు గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆరోపించారు. దీంతో కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. గిరిజన మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ని కోరారు. గిరిజనుల రిజర్వేషన్లపై లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
మరోవైపు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై అక్కసు చూపించారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం అందలేదని కేంద్రం తుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ పలుమార్లు మాట్లాడరని.. ఎన్నోసార్లు లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల రిజర్వేషన్లపై 2017 తీర్మానం చేసి పంపించామని ఐదేళ్లు గడిచినా..కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మంత్రి పచ్చిఅబద్ధాలు మాట్లాడారని పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు.