మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కేసీఆర్ నాయకులుగా తయారు చేశారని పల్లా అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ఎంతో మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వెళ్లిపోయారని గుర్తు చేశారు. గతంలోనూ చాలా మంది నేతలు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తూ కేసీఆర్‌పై విమర్శలు చేశారని ఇప్పుడు ఈటల కూడా వారినే అనుసరిస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని పల్లా స్పష్టం చేశారు. ఈటల వెనుక ఉన్నది కొంత మంది అసంతృప్తులు మాత్రమేని తెలిపారు.
ఈటలకు ఆత్మగౌరవం ఉంటే.. పేదల ఆస్తులను అక్రమంగా ఆక్రమించేవారు కాదు అని వ్యాఖ్యానించారు. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు.. బయటకు వెళ్లి నియంత, దెయ్యం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు పథకం మీద ఈటల వ్యాఖ్యలు అర్థరహితం అని పేర్కొన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు.
ఈటలను టీఆర్ఎస్ పార్టీ ఎంతో గౌరవించిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. ప్రగతి భవన్‌లోకి రానివ్వలేదని చెబుతున్న..ఈటల అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? అని పల్లా ప్రశ్నించారు. తెలంగాణలో ఏ పథకం తీసుకురావాలని చూసినా ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవారని, అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరేవారని పల్లా తెలిపారు.