భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు కొట్టిపడేశారు. ఆయన ఇంకా పోలీసులకు చిక్కలేదని, పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు స్పష్టం చేశారు.
వనమా రాఘవను నిన్న సాయంత్రం అరెస్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీపీ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు. తమకు చిక్కకుండా బెయిలు కోసం ప్రయత్నిస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కొత్తగూడెం తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వనమా రాఘవేంద్రరావు కోసం గాలిస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. దొరికిన తర్వాత రాఘవేంద్రరావును అదుపులోకి తీసుకుంటామని, అతనిపై నమోదైన కేసుల ఆధారంగా కూడా విచారణ జరుపుతామని చెప్పారు.
కాగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆస్తికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రాఘవేంద్రరావు తన భార్యను లైంగికంగా కోరుతున్నాడని ఆరోపిస్తూ బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యకు రాఘవే కారణమంటూ బాధితుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రాఘవేంద్ర అదృశ్యమయ్యారు. ఈ ఘటన రాజకీయంగా సంచలనమైంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. నిందితుడిని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే వనమా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..