హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. ఇంకా నోటిఫికేషన్ వెలువడకుండానే నియోజకవర్గంలో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ దూకుడే ఆయుధంగా ముందుకు వెళ్తోంది. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ సైతం అదే తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఈటల మాటల తూటాలు పేలుస్తుంటే .. అభివృద్ధి బావుటాతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది .
ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో వందల కోట్లు ఖర్చు పెడుతోంది. దళిత బంధు లాంటి పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు కీలక నేతలను సైతం టీఆర్ఎస్ లో చేర్చుకుంది. ఈ క్రమంలో ప్రజాగాయకుడు గద్దర్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ వీరి భేటీపై ఆసక్తికర సర్వత్ర చర్చ జరుగుతోంది. సీఎం దళితుల సంక్షేమం కోసం దళిత బంధును తీసుకువచ్చారని, ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని టీఆర్ఎస్ నేతలు గద్దర్‌కు వివరించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం గద్దర్ మద్దతును మంత్రి అడిగినట్లు సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి . అభ్యర్ధిని ప్రకటించిన టీఆర్ఎస్ తన దూకుడు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు ఇన్చార్జీ బాధ్యతలను మంత్రి హరీశ్ రావు తీసుకున్నారు. తమకు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్ధాప్య పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగిస్తున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందేలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీ నాయకులను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకుని ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచే విధంగా ప్రణాళిలకు చేశారు.
ఇది కూడా చదవండిః కరోనా థర్డ్ వేవ్ ముప్పు… కోవిడ్ నిబంధనలను పొడిగించిన కేంద్రం