Thursday, November 21, 2024

పోలీసుల అదుపులో టీఆర్ఎస్ నేత పుట్ట మధు..

కొద్ది రోజు క్రితం అదృశ్యమైన పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. దీంతో అయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్టా మధు..ప్రస్తుతం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.

మూడు నెలల క్రితం మంథని వద్ద జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల హత్య కేసులో మధు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. పుట్ట మధు మిస్సింగ్ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది.

గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. మధు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్‌కు పుట్ట మధు సన్నిహితంగా ఉన్నారు. ఈటలతో కలిసి ఆయన వ్యాపార లావాదేవీలను కూడా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలతో సంబంధాల నేపథ్యంలో మధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.

మరోవైపు తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని పుట్ట మధు భార్య పుట్ట శైలజ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని తెలిపారు. తాము టీఆర్‌ఎస్‌ తోనే ఉంటామని, తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని చెప్పారు. పుట్ట మధుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement