తెలంగాణలో ఈటల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈటలకు పలువురు నేతలు మద్దతు ఇస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎవరూ స్పందించ వద్దని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన వేళ… ఓ కీలన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యవహారంలో సీఎం కేసీఆర్ వైఖరిపై ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. ఉద్యమ కారుడైన ఈటల రాజేందర్ ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటలకు బాహుబలి సినిమాలో కట్టప్పలా వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు.
భూ కబ్జా ఆరోపణలు వస్తే ఆదరాబాదరాగా విచారణ చేపట్టడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎం తన సామాజిక వర్గాన్ని అభ్యున్నతి చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఈటల రాజేందర్‌ను కావాలనే అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే కేసీఆర్ నిర్ణయంపై తీర్పు చెబుతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఈటలపై చేపడుతున్న కక్ష్య పూరితమైన చర్యలకు నిరసనగా తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని నగేష్ ప్రకటించారు.