Wednesday, November 20, 2024

Big Breaking: మునుగోడు మొనగాడు టీఆర్​ఎస్​.. ఘోర పరాజయం చెందిన బీజేపీ

నల్లగొండ జిల్లా మునుగోడులో టీఆర్​ఎస్​ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా భారీ విజయం సాధించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డిపై టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి ప్రతీకారం తీర్చుకున్నారనే చెప్పవచ్చు. 10,309 ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల విజయం సాధించి, సీఎం కేసీఆర్​కు మునుగోడు ఫలితాన్ని బహుమతిగా అందించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 10.30 గంటల వరకు ఓటింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం తుది పోలింగ్‌ లెక్కలను అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,805 మంది ఓటర్లలో 2,25,192 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈసారి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్య జరిగిందన్నది స్పష్టమైంది.

ఇక.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టులో బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి బీజేపీ టికెట్‌పై రాజగోపాల్​రెడ్డి పోటీ చేశారు. 2018లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దింపింది. కాగా, మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిరెడ్డిని కాంగ్రెస్‌ తరపున బరిలోకి దింపింది. ఈసారి మాత్రం నల్లగొండ జిల్లాలో బలమైన కేడర్​ను కలిగి ఉన్న వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం టీఆర్​ఎస్​కు మద్దతు తెలిపాయి.

- Advertisement -

ఓట్ల లెక్కింపు సందర్భంగా హైడ్రామా..

కౌంటింగ్​ సందర్భంగా ఇవ్వాల (ఆదివారం) కొద్దిసేపు హైడ్రామా నెలకొంది. మొదటి రౌండ్​లో టీఆర్​ఎస్​కు ఆధిక్యం వచ్చింది. ఆ తర్వాత రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థికి స్వల్ప ఆధిక్యత వచ్చింది. కాగా, అప్పటికే బీజేపీ అభ్యర్థి గెలుపుదిశగా వెళ్తున్నారని, 1100 మెజారిటీతో దూసుకెళ్తున్నట్టు కొన్ని టీవీ చానళ్లలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాలుగో రౌండ్ ప్రకటన సమయంలో కాస్త ఆలస్యం కావడంతో  బీజేపీ లీడర్లు, కేంద్ర మంత్రులు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు.

కావాలనే ఎలక్షన్​ కౌంటింగ్​ని ప్రకటించడం లేదని, బీజేపీ ఆధిక్యం వచ్చినప్పుడు ఆపేస్తున్నారనే వాదనలు తీసుకొచ్చారు. దీంతో రంగంలోకి వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడం, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అబ్జర్వర్ల వల్ల కాస్త ఆలస్యం అవుతోందని వివరించారు. ఇక.. అప్పటి నుంచి ప్రతి రౌండ్​లోనూ ఎట్లాంటి ఆటంకాలు జరగకుండా ఫలితాలు వెల్లడించారు.

కాగా, ప్రతి రౌండ్​లోనూ టీఆర్​ఎస్​ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. చివరికి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి (86,697) మీద టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి (97,006) ఓట్లు సాధించి 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్​ఎస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. పటాకులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement