Friday, November 22, 2024

ఈటల విధేయులే టార్గెట్… ఎంపీ రంజిత్ రెడ్డిపై టీఆర్ఎస్ గురి!

ఈటల రాజేంధర్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఈటల పార్టీ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతారన్న ఉహగానాలు వస్తున్నాయి. ఒక వేళ ఈటల కొత్త పార్టీని ప్రారంభిస్తే తనకు టీఆర్ఎస్ లో నమ్మకంగా ఉన్న నాయకులను పార్టీలో చేరడం ఖాయం అని సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈటలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకులపై టీఆర్ఎస్ అధిష్టానం డేగ కన్ను పెట్టింది. ఈటల తర్వాత చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని గులాబీ పార్టీ టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కరీంనగర్ జిల్లాకు చెందిన రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరుపున రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల నుంచి ఎంపీగా గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీలో ఈటలకు అత్యంత సన్నిహితుడిగా రంజిత్ రెడ్డికి పేరుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వారి మధ్య ఎన్నో లావాదేవీలు ఉన్నాయి.  పౌల్ట్రీ ఫీడింగ్, కోడిపిల్లల అమ్మకం రెండింట్లో దేశంలోనే టాప్‌ 5వ స్థానంలో నిలిచారు. ఈటలకు పౌల్ట్రీ  ఉండటంతో వ్యాపారంలో మంచి స్నేహితులు అయ్యారు. రాజకీయాల్లో ఈటల రాజేందర్‌ మొత్తం వ్యవహారం రంజిత్ రెడ్డినే చూసే వారు.   

ఈ మధ్యే ఈటల మాట్లాడుతూ..తనకు ఉన్న వ్యాపార సంబంధాల గురించి ప్రాస్తావించాడు. తనకు ఎంపీ రంజిత్ రెడ్డికి మూడు దశాబ్దాల నుంచి అనుబంధం ఉందని తెలిపారు. పౌల్ట్రీ బిజినెస్ తో పాటు వ్యవసాయ రంగంలో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈటల అనుచరుడిగా గుర్తింపు పొందిన పుట్ట మధు పోలీసుల అదుపులో ఉన్నారు. పది రోజుల క్రితం అదృశ్యం అయిన పుట్ట మధును శనివారం పోలీసులు ఏపీలోని భీమవరంలో అదుపు తీసుకుని విచారిస్తున్నారు.  హైకోర్టు లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టమధు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, కొత్త పార్టీ పెట్టేందుకు ఈటల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికోసం ముందస్తు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది బయటకు మద్దతు ఇవ్వపోయినా… ఈటల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే  ఈటలతో ఎంపీ రంజిత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో గులాబీ అగ్రనాయకత్వం ఆయనపై ఫోకస్ పెట్టిందని, రంజిత్ రెడ్డిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల భూదందాలో రంజిత్ రెడ్డి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్ రావు, జమ్మికుంట సీఐ రమేశ్, హుజురాబాద్ టౌన్ సీఐ సదన్ కుమార్ ను..కరీంనగర్ డీఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది ప్రభుత్వం. హుజురాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్, హుజురాబాద్ తహశీల్దార్ బావ్ సింగ్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ ఎంపీడీవోలను కూడా ఇప్పటికే బదిలీ చేసింది.

- Advertisement -

తనపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత ఈటలను కేబినెట్ నుంచి బర్తారఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌తో కలిసి 19 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నానని, పార్టీకి నష్టం కలిగించే పని ఏనాడు చేయలేదన్నారు. పథకం ప్రకారమే తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో అడుగులో అడుగు వేశాక సింగిల్ వ్యాపారం ఒక్కటి కూడా చేయలేదన్నారు ఈటల. తనకు పదవులు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. చావునైనా భరిస్తాను కాని.. ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించలేనన్నారు. దీంతో ఇప్పుడు ఈటల తన భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: రెండేళ్లు అవుతోంది.. దశల వారీ మద్యనిషేధం ఎక్కడి వరకు వచ్చింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement