Wednesday, November 20, 2024

అసంతృప్తిలో గులాబీ నేత!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టికెట్ ఇచ్చారు. మంగ‌ళ‌వారం ఉద‌యం టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా భ‌గ‌త్ నామినేష‌న్ వేయ‌నున్నారు. టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. సీటుపై చివ‌రి వ‌ర‌కు ఆశ‌లు పెట్టుకున్న కోటిరెడ్డిని మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి సీఎం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లారు. ఆయనకు మరో విధంగా న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మ‌ర‌ణించిన కుటంబం నుండి ఎవ‌రూ గెలుపొంద‌లేదు. పార్టీ ఏదైనా పాలేరు నుండి దుబ్బాక వ‌ర‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల మ‌ర‌ణంతో వ‌చ్చిన ప్ర‌తి ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ ఈసారి ఇత‌రుల‌కు టికెట్ ఇస్తార‌ని అంతా ఊహించారు. అయితే, బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గంతో పాటు క‌మ్యూనిస్ట్ నేత‌గా ఉన్న నోముల కుటుంబానికే టికెట్ ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణయించారు.  నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇవ్వడం మేలని టీఆర్ఎస్ అధిష్టానం భావించింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల్సిన ఆపార్టీ గట్టి పట్టుదలతో ఉంది. మరోవపు నాగార్జునసాగర్ సీటు కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఆపార్టీ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగారు. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఏప్రిల్ 17 నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement