Friday, November 22, 2024

దేవుడిపైనే ‘భారం’ వేసిన టీఆర్ఎస్

టీఆర్ఎస్ నేతలకు ఈ మధ్య దైవభక్తి ఎక్కువైనట్లు సోషల్ మీడియాలో పలువురు చర్చించుకుంటున్నారు. అయితే దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. బుధవారం కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ పారాయణంలో పాల్గొనగా.. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేముందు మంత్రి హరీష్‌రావు కూడా జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ దేవాదాయశాఖకు, ఆలయాల్లో దూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.720 కోట్ల నిధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది దేవాదాయ శాఖకు రూ.500 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. దీంతో టీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ లేని విధంగా దేవుడిని దర్శించుకోవడం, దేవుడికి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుండటంతో ఆ పార్టీ నేతలు దేవుడిని ప్రసన్నం చేసుకుంటున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement