రాబందుల పునరుత్పత్తికి చర్యలు ప్రారంభమయ్యాయి. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న వాటిని(వల్చర్) కాపాడాలంటున్నారు పర్యావరణవేత్తలు.. త్రిపుర రాష్ట్రంలోని ఖోవై జిల్లాలో ప్రత్యేకంగా వీటిని పెంచేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. కృత్రిమ పెంపకం కోసం ఇతర రాష్ట్రాల నుంచి రాబందుల తెప్పిస్తామంటున్నారు త్రిపుర అధికారులు..
త్రిపుర అటవీ శాఖ ఖోవై జిల్లాలో ‘రాబందు సంరక్షణ, కృత్రిమ పెంపకం’ కార్యక్రమం ద్వారా అంతరించిపోతున్న రాబందు జాతిని పెంచే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది ప్రభుత్వం. ఖోవైలో రాబందుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని.. కృత్రిమ పెంపకంలో సహాయపడేందుకు ఇతర రాష్ట్రాల నుంచి రాబందులను తెప్పిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బుతో త్వరలో ఖోవై జిల్లాలోని పద్మాబిల్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. హర్యానా నుండి రాబందులను తీసుకురావడం ద్వారా కృత్రిమంగా సంతానోత్పత్తి చేసి.. ఆ తర్వాత పిల్లలను అడవిలో వదలేస్తామని తెలిపారు ఖోవైలోని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) నీరాజ్ కె చంచల్.
ఇటీవల జిల్లాలో దాదాపు 30-40 రాబందులు కనిపించాయి. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈ స్కావెంజర్ పక్షి రాష్ట్రంలో దాదాపు అంతరించిపోయిందని అనుకున్నాం. అయితే అటవీ శాఖ ఆధ్వర్యంలో వాటి గూళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పుడు సంఖ్య పెరుగుతోందన్నారు. రాబందులు అంతరించిపోకుండా కాపాడే ఏకైక చర్యగా కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ కనిపిస్తోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డీకే శర్మ తెలిపారు.
రాబందులలోని మూడు జాతులలో ఒక్కొక్కటి 150 జతలను తెప్పించి వాటి పెంపకం చేయగలిగితే.. పిల్లలు పుట్టిన పదేళ్లలోపు 3 జాతులలో ఒక్కొక్కటి 600 జతలుగా డెవలప్ చేయొచ్చన్నారు. ఇది జన్యుపరంగా వైవిధ్యమైనదిగా ఉంటుందని స్పష్టం చేశారు డీకే శర్మ.
త్రిపుర ప్రభుత్వం.. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ద్వారా ఇప్పటివరకు మూడు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారని, నదీతీరంలో ఆకులతో కూడిన షిముల్ చెట్లను పెంచడం వల్ల వాటి గూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్ చంచల్. అయితే.. రాబందులు నదిలో తేలియాడే జంతువుల కళేబరాలను తినడం ద్వారా ఆహార కొరతను అధిగమించాయని వివరించారు. ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా స్కావెంజర్ పక్షి ఇప్పటికీ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానిని తీర్చడానికి అటవీ శాఖ వాటికి ఫుడ్ సేకరించి అందిస్తున్నట్టు తెలిపారు. కాగా, దేశంలో కనిపించిన తొమ్మిది జాతుల పక్షులలో త్రిపురలో ఉన్నవి ప్రత్యేకమైన జాతిగా చెప్పుకొచ్చారు చంచల్. ఇక్కడున్న జాతి వైట్-రంప్-ఎడ్ రాబందు అని.. ఇది IUCN ప్రకటించిన అంతరించిపోయే జాతుల జాబితాలో తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు చెప్పారు.
రాబందుల సంఖ్య తగ్గడానికి అడవుల్లో మానవ చొరబాట్లు, వాటికి ఫుడ్ అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని ది లాస్ట్ ఫ్లైట్ ఆఫ్ ది వల్చర్‌ను రచించిన పక్షి శాస్త్రవేత్త ప్రసేన్‌జిత్ బిస్వాస్ అన్నారు. రుద్ర సాగర్ సరస్సు, దాని పరిసరాలు… సిపాహిజలా అభయారణ్యంతోపాటు పెద్ద సరస్సులు, అడవుల్లో 1980ల చివరి వరకు తెల్లటి రాబందులు కనిపించేవని.. వాటికి ఇష్టమైన ప్రదేశాలు ఇవేనని ఆయన చెప్పారు.
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సర్వే ప్రకారం 2013లో త్రిపుర రాష్ట్రంలో కేవలం 55 రాబందులు మాత్రమే కనిపించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాబందుల సర్వే చేపట్టలేదు. భారత ఉపఖండంలో రాబందుల సంఖ్య1990లలో బాగా దెబ్బతిన్నది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్ లో రాప్టర్‌ల సంఖ్యను పర్యవేక్షిస్తున్నప్పుడు.. మొదటిసారి 1996-97లో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS) ఈ విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా వీటిపై ఓ డాక్యుమెంట్ కూడా చేశారు.
బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS)దేశంలోని అనేక ప్రాంతాల్లో 1991, 1993 మధ్య రాప్టర్ సర్వేలను నిర్వహించింది. 2000 సంవత్సరంలో కూడా సర్వే కొనసాగించారు. “ఓరియంటల్ వైట్-బ్యాక్డ్ వల్చర్, లాంగ్-బిల్డ్ రాబందుల సంఖ్య 1991-93, 2000 మధ్య 92% కంటే ఎక్కువ తగ్గిపోయింది. 2007 సంవత్సరం నాటికి ఓరియంటల్ వైట్-బ్యాక్డ్ రాబందుల సంఖ్య 99.9% తగ్గిపోయింది. లాంగ్ బిల్, స్లెండర్ బిల్ రాబందుల్లో 97% అంతరించాయి. కాగా, మొత్తం మూడు రాబందు జాతులను IUCN, వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, 2000లో అంతరించిపోతున్న జాతుల జాబితా చేర్చాయి.
ఈ అంచనా సమీప భవిష్యత్తులో అడవిలో ప్రపంచ విలుప్త ప్రమాదం ఎక్కువగా ఉందని సూచించింది. దేశంలోని వన్యప్రాణుల రక్షణలో అత్యున్నత వర్గం అయిన భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) షెడ్యూల్-Iలో రాబందులు కూడా జాబితా చేయబడ్డాయి.